అభివృద్ధికి ఆమడ దూరంలో ఆనెమడుగు
ప్రజాశక్తి-కావలి : వైసిపి ప్రభుత్వ హయాంలో ఆనెమడుగు పంచాయతీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నదని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి మాలేపాటి సుబ్బా నాయుడు పేర్కొన్నారు. కావలి రూరల్ మండలం ఆనెమడుగు పంచాయతీలో ఆదివారం సుబ్బనాయుడు ఆధ్వర్యంలో ''ఇదేమి ఖర్మ రాష్ట్రానికి'' కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని 23వ రోజు నిర్వహించారు. టిడిపి నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ''ఇదేమి కర్మ మన రాష్ట్రానికి'' కరపత్రాలు, క్యాలెండర్లు పంచి పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబునాయుడు ప్రభుత్వ హయాంలో అమలైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ప్రస్తుత జగన్మోహన్‌రెడ్డి పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. గ్రామాల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణానికి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో వేలకోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టారని గుర్తుచేశారు. వైసిపి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఒక్కరోడ్డు కూడా బాగు చేయలేదని విమర్శించారు. అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు నాయుడు పథకాలను ప్రవేశ పెడితే, జగన్మోహన్ రెడ్డి కొద్ది మందికే సంక్షేమ ఫలాలు అందిస్తూ 90శాతం మంది ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. వైసిపి పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు, చార్జీలు, పన్నులు ఎలా పెరిగాయో ప్రజలు గమనించాలని కోరారు. జగన్‌కు మరో ఛాన్స్ ఇస్తే రాష్ట్రం సర్వనాశనం అయిపో వడం ఖాయమని, ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. అనంతరం ''సైకో పోవాలి - సైకిల్ రావాలి'' అంటూ పార్టీ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు గుత్తికొండ కిషోర్‌బాబు, బూచి రవియాదవ్, రూరల్ నాయకులు పాల్గొన్నారు.










