- ఉత్కంఠ పోరులో నెదర్లాండ్స్‌పై పరుగు తేడాతో విజయం
హరారే: జింబాబ్వే బౌలర్ మదెవెరె హ్యాట్రిక్‌తో సత్తా చాటడంతో నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను జింబాబ్వే 1-1తో సమం చేసింది. తొలి వన్డేలో పర్యాటక నెదర్లాండ్స్‌జట్టు జింబాబ్వేపై సంచలన విజయం సాధించగా, గురువారం జరిగిన రెండో వన్డేలో జింబాబ్వేజట్టు ఒక్క పరుగు తేడాతో నెదర్లాండ్స్‌ను ఓడించింది. ఆఖరి బంతి వరకు నువ్వా-నేనా అన్నట్లు సాగిన ఈ సమరంలో జింబాబ్వే గెలిచింది. జింబాబ్వే ఆల్‌రౌండర్ వెస్లీ మదెవెరె హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టి నెదర్లాండ్స్‌పై గెలుపుకు దోహదపడ్డాడు. జింబాబ్వే నిర్దేశించిన 272పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నెదర్లాండ్స్‌ను 44వ ఓవర్‌లో మదెవెరె తొలి 3 బంతులకు 3 వికెట్లు తీసి దెబ్బకొట్టాడు. ఈ దెబ్బతో సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి. మదెవెరె తొలి బంతికి ఆకెర్‌మన్‌ను స్టంపౌట్ చేయగా.. ఆతర్వాత బంతికి ఎన్. తేజను, మూడో బంతికి వాన్ మీకెరెన్‌ను క్లీన్ బౌల్డ్ చేసి హ్యాట్రిక్ నమోదు చేశాడు. నెదర్లాండ్స్ చివర్లో గెలవాలంటే 39 బంతుల్లో 59 పరుగులు చేయాల్సి వచ్చింది. చేతిలో 4 వికెట్లు మాత్రమే ఉన్నాయి. అయినా ఏ మాత్రం తగ్గని నెదర్లాండ్స్ అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి మ్యాచ్‌ను ఆఖరి బంతి వరకు తీసుకువచ్చింది. ఆఖరి ఓవర్‌లో నెదర్లాండ్స్ గెలుపుకు 19 పరుగులు అవసరం కాగా (చేతిలో ఒక్క వికెట్ మాత్రమే ఉంది).. ర్యాన్ క్లెయిన్, క్లాసెన్ అద్భుతంగా పోరాడి 17పరుగులు కొట్టాడు. ఆఖరి బంతికి బౌండరీ సాధించాల్సి ఉండగా.. ర్యాన్ 2 పరుగులు తీసి రనౌట్ కావడంతో జింబాబ్వే పరుగు తేడాతో బయటపడింది. అగ్రశ్రేణి జట్ల పోరాటాన్ని తలపించిన ఈ మ్యాచ్ ప్రేక్షకులకు అసలుసిసలైన క్రికెట్ మజాను అందించింది. ఇరుజట్ల మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే మార్చి 25న జరుగుతుంది.










