Sep 28,2023 21:42

- రాష్ట్రవ్యాప్తంగా జయంతి వేడుకలు
- దోపిడీ లేని సమాజం కోసం ఉద్యమించాలి : రామన్న
ప్రజాశక్తి - యంత్రాంగం :భగత్‌ సింగ్‌ స్ఫూర్తితో విద్య, ఉపాధి అవకాశాల కోసం యువత పోరాడాలని పలువురు నాయకులు కోరారు. భగత్‌ సింగ్‌ 116వ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు.విజయవాడలో మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో, 60వ డివిజన్‌ వాంబేకాలనీలో భగత్‌ సింగ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న మాట్లాడుతూ.. చిన్న వయస్సులోనే దేశం పట్ల, ప్రజల పట్ల అత్యంత భక్తి కలిగిన వీరుడు భగత్‌ సింగ్‌ అని కొనియాడారు. బ్రిటిష్‌ సామ్రాజ్యవాదులను గడగడలాడించి స్వేచ్ఛ కోసం, సమానత్వం కోసం, దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేశారని తెలిపారు. అసమానతలు తొలగిపోవాలంటే సోషలిజమే మార్గమని నమ్మి, అందుకోసం యువత పోరాడాలని ఆరోజే కోరారని గుర్తు చేశారు. ఈరోజు దేశాన్ని పట్టి పీడుస్తున్నా నిరుద్యోగం, ధరలు, పేదరికం, నిరక్షరాస్యత, ఆకలి చావులు, రైతు ఆత్మహత్యలు, మహిళలపై అఘాయిత్యాలు, దళితులపై దాడులు అంతరించినప్పుడే నిజమైన స్వాతంత్య్రం అని, అదే భగత్‌ సింగ్‌కు మనం అర్పించే నిజమైన నివాళి అని అన్నారు. అవినీతి రహిత, అసమానతలు, దోపిడీ లేని సమాజం కోసం ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో రక్తదాన శిబిరం నిర్వహించారు. డాక్టర్‌ పామరాజు వెంకటేశ్వర్లు, ఎస్‌ఎఫ్‌ఐ మాజీ నాయకులు ఎ.లకీëశ్వరరెడ్డి ఈ శిబిరాన్ని ప్రారంభించారు. గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, మంగళగిరిలో భగత్‌సింగ్‌ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. విశాఖ జిల్లా అక్కయ్యపాలెం ఎఎస్‌ఆర్‌.నగర్‌లో మొక్కలు నాటారు. ఉమ్మడి అనంతపురం,పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా భగత్‌సింగ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కర్నూలులో కొత్త బస్టాండ్‌ నుంచి సుందరయ్య జంక్షన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. బాపట్లలో ఫోరం ఫర్‌ బెటర్‌ ఆధ్వర్యంలో నివాళుర్పించారు.