ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : విశాఖపట్నం జివిఎంసి పరిధిలోని 16 వ వార్డు పరిధిలో భాను నగర ప్రాంతం లో రేపు జరగనున్న ఎంఎల్సీ పట్టభద్రుల ఎన్నికలకుగాను ఓటర్లకు డబ్బులు పంచుతున్న వైసిపి కార్యకర్త కొల్లి ఈశ్వర్ రావు (26)ను పిడిఎఫ్ నాయకులు పి.మణి, గంగరావు, ఆర్‌విఎస్ కె.కుమార్, తదితరులు పట్టుకున్నారు. అనంతరం స్థానిక ఎంఆర్‌ఓకు సమాచారమివ్వగా సంఘటన స్థలానికి చేరుకున్న సీతమ్మధార ఎంఆర్‌ఓ శ్యాం కుమార్ ప్రాధమిక విచారణ అనంతరం నిందితుడు ఇచ్చిన సమాచారాన్ని మీడియాకు తెలిపారు. స్థానిక 16వ వార్డులో ఎంఎల్సీ ఓటర్లకు పంచేందుకు వైసిపి కార్యాలయంలో రూ.10,0000 నగదు, లిస్ట్ ఇచ్చారని నిందితుడు తెలిపినట్లు అన్నారు. ఒక్కొక్కరికి 1,000 రూపాయల చొప్పున పంచారని చెప్పినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని, అతడు ఇప్పటికే 15 మందికి డబ్బులు పంచాడని, మిగిలిన 85,000 రూపాయలను అధికారులు స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ నిమిత్తం ఎంవిపి పోలీస్ స్టేషన్ కు తరలించారని తెలియజేశారు.