వైసిపి, టిడిపి మేనిఫెస్టోలు కాంగ్రెస్ మేనిఫెస్టోకు సరిరావు : తులసి రెడ్డి
ప్రజాశక్తి - ఎర్రగుంట్ల (కడప) : వైసిపి, టిడిపి మేనిఫెస్టోలు కాంగ్రెస్ మేనిఫెస్టోకు ఏమాత్రం సరిరావని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ నర్రెడ్డి తులసి రెడ్డి అన్నారు. పలు కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరికలకు సంబంధించి శనివారం ఎర్రగుంట్లకు విచ్చేసిన ఆయన మొదటగా పట్టణ పరిధిలోని రాణివనం, మండల పరిధిలోని కదిరివారిపల్లెకు చెందిన పలు కుటుంబాలను పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ... వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఆరు సూత్రాల కార్యక్రమాన్ని అమలు చేస్తుందన్నారు. రాష్ట్రంలో రైతన్నలకు గిట్టుబాటు ధర లభించక అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నారని, దేశంలోనే రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం 3వ స్థానంలో ఉందని, అలాగే కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలో ఉందని అన్నారు. రైతులను అప్పుల ఊబి నుండి బయటకు తెచ్చేందుకు 6 లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ చేస్తామని తెలిపారు. మహిళలకు సంబంధించి 500 రూపాయలకే వంటగ్యాస్, నిరుపేద కుటుంబాలకు నెలకు రూ.6 వేల ఆర్థిక సాయం, రాష్ట్రానికి ప్రత్యేక హౌదా కల్పించడం, రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ, జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు, దుగరాజపట్నం వద్ద నూతన ఓడరేవు నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, విశాఖ, విజయవాడలో మెట్రో రైలు, విశాఖ రైల్వే జోన్ తదితర వాటిని పూర్తి చేస్తామని తెలిపారు. రాబోవు ఎన్నికల్లో వైసీపీ, టిడిపిలను ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని తులసిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్య శర్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఓబయ్య,జానకిరామ్, మండల అధ్యక్షుడు జయరామిరెడ్డి,నరసింహారెడ్డి, ఉత్తన్న,నాగార్జున, వినరు తదితరులు పాల్గొన్నారు.










