- త్వరలో టిడిపిలోకి ముగ్గురు ఎంఎల్‌ఎలు!
- గ్రీన్ సిగల్ ఇచ్చిన చంద్రబాబునాయుడు
ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి : నెల్లూరు జిల్లా రాజకీయాలు మరోసారి వెడెక్కాయి. ఇటీవల వైసిపి నుంచి బహిష్కరణకు గురైన ముగ్గురు ఎంఎల్‌ఎలు టిడిపిలో చేరనున్నారు. ఇందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు గ్రీన్ సిగల్ ఇచ్చారు. నెల్లూరు ఉమ్మడి జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అన్ని స్థానాలనూ గత ఎన్నికల్లో వైసిపి గెలుచుకుంది. వైసిపి ప్రభుత్వం విధానాలు నచ్చకపోవడంతో ఆ పార్టీ వెంకటగిరి, ఉదయగిరి, నెల్లూరు రూరల్ ఎంఎల్‌ఎలు ప్రభుత్వంపై గతంలో విమర్శలు చేశారు. దీంతో, అధిష్టానం ఆ ముగ్గురినీ ఒకటన్నర నెలల క్రితం సస్పెండ్ చేసింది. అప్పటి నుంచి ఆ ముగ్గురూ టిడిపిలో చేరుతారని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో శుక్ర, శనివారాల్లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు నెల్లూరుల హాట్ టాఫిక్‌గా మారాయి. వెంకటగిరి ఎంఎల్‌ఎ ఆనం రామనారాయణరెడ్డి శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో చంద్రబాబునాయుడును కలిశారు. పార్టీలోకి వస్తానని చెప్పడంతో అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. లోకేష్ పాదయాత్రను విజయవంతం చేయాలని, అటు తరువాత అధికారికంగా పార్టీలో చేరాలని చంద్రబాబునాయుడు సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శనివారం నెల్లూరులో టిడిపి సీనియర్ నేతలు సంతపేటలోని ఆనం రామనారాయణరెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. తాను టిడిపిలోకి వస్తానని, కలిసి పనిచేస్తానని, అవసరమైతే ఎంఎల్‌ఎ పదవికి రాజీనామా చేస్తానని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. అక్కడ నుంచి ఆయన నేరుగా టిడిపి నేతలతో కలిసి ఎన్‌టిఆర్ భవన్‌కు వెళ్లారు. అక్కడ సినీనటులు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకల్లో పాల్గన్నారు. అనంతరం టిడిపి ఆత్మకూరు నేతలతో సమావేశమయ్యారు. ఆదివారం ఆయన ఆత్మకూరులో తన అనుచరులతోనూ, టిడిపి నేతలతోనూ భేటీ కానున్నారు. అంతకు ముందు టిడిపి సీనియర్ నేత అమర్‌నాథ్‌రెడ్డి, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర మాగుంట లేవుట్‌లోని నెల్లూరు రూరల్ ఎంఎల్‌ఎ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నివాసానికి వెళ్లారు. పార్టీలోకి రావాలని ఆయనను ఆహ్వానించారు. తాను టిడిపిలోకి వస్తానని, లోకేష్ పాదయాత్రను విజయవంతం చేస్తానని శ్రీధర్‌రెడ్డి ఈ సందర్భంగా ప్రకటించారు. వైఎస్‌ఆర్ జిల్లా బద్వేల్‌లో పాదయాత్ర నిర్వహిస్తోన్న నారా లోకేష్‌ను ఉదయగిరి ఎంఎల్‌ఎ మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి శనివారం కలిశారు. తాను టిడిపిలో చేరుతానని చెప్పారు. అందుకు లోకేష్ సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. తన నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్రను విజయవంతం చేస్తానని, టిడిపి టికెట్ ఇస్తే పోటీ చేస్తానని, లేదంటే ఎవరికి టికెట్ ఇచ్చినా పనిచేస్తానని ఈ సందర్భగా మీడియాకు చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. తనతోపాటు మరో ఇద్దరు ఎంఎల్‌ఎలు కూడా టిడిపిలో చేరుతున్నామని ఆయన ప్రకటించారు.












