Apr 10,2023 12:41
  • 30,935 చదరపు కిలోమీటర్లలో పూర్తి
  • డిప్యుటేషన్లు రద్దు చేయాలని కోరుతున్న సర్వేయర్లు

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీ సర్వే ఈ ఏడాది డిసెంబర్‌ చివరికి పూర్తి చేయాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందా? లేదా అనే మీమాంశ రెవెన్యూ వర్గాల్లో వ్యక్తమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 17,460 గ్రామాల్లో 1.22 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రీ సర్వే పూర్తి చేయాలని లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకున్నప్పటికీ, ఆచరణలో ఒకడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అనే చందంగా సాగుతోంది. రీ సర్వే కోసం ప్రభుత్వం డ్రోన్‌, కార్స్‌ (కంటిన్యూయస్‌ ఆఫరేటింగ్‌ రిఫరెన్స్‌ సిస్టమ్‌)ను వినియోగిస్తోంది. 21.12.2020న భూముల రీసర్వే ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు 20 ట్రినిటి డ్రోన్లను కొనుగోలు చేయగా, సర్వే ఆఫ్‌ ఇండియా 8 డ్రోన్లను అందించింది. 5,163 గ్రామాలకు సంబంధించి 30,935 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సర్వే పూర్తయినట్లు రెవెన్యూ గణాంకాలు తెలుపుతున్నాయి. మొదటి విడతలో 5,500 గ్రామాలు, రెండవ విడతలో 6,500 గ్రామాలు, మూడవ విడతలో 5,500 గ్రామాల భూములు రీసర్వే పూర్తిచేసేలా ప్రభుత్వం షెడ్యూల్‌ ఖరారు చేసింది. ఇందులో భాగంగా 2023-24కు ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌ను ప్రభుత్వం తయారు చేసింది. భూముల రీసర్వే ప్రక్రియ పూర్తయితే భూయజమానులకు సంబంధించిన యూనిక్యూ నెంబరుతో కూడిన భూ యాజమాన్య హక్కు పత్రాలను అందజేస్తారు. కొత్తగా నమోదు చేసిన విస్తీర్ణంతో ల్యాండ్‌ పార్శిల్‌ మ్యాపింగ్‌ (ఎల్‌పిఎమ్‌) ఎఫ్‌ఎమ్‌బి, యూనిక్యూతో భూమికి సంబంధించిన సరిహద్దులను నిర్ణయిస్తారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహించే భూముల రీసర్వే కావడంతో కచ్ఛితత్వంతో కూడిన విస్తీర్ణం నమోదవుతుందని రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి.
 

                                                                        రీసర్వే కోసం శిక్షణ

భూముల రీసర్వే ప్రక్రియలో ఆధునిక సాంకేతికను వినియోగించుకునేందుకు వీలుగా ప్రభుత్వం విఆర్‌ఒ, గ్రామ సర్వేయర్లు తహశీల్దార్లు, రెవెన్యూ సబార్డినేట్లకు కాకినాడ జిల్లా సామర్లకోటలోని ఎపి సర్వే ట్రైనింగ్‌ అకాడమీలో ఇప్పటివరకు 39 బ్యాచ్‌లకు శిక్షణ ఇచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. శిక్షణ పొందిన వారిలో 7,500 మంది గ్రామ సర్వేయర్లు, 4,950 మంది రెవెన్యూ సిబ్బంది, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ సిబ్బందితో పాటు ప్రొబేషనరీ పీరియడ్‌లోని రెవెన్యూ సబార్డినేట్లు, విఆర్‌ఒ గ్రేడ్‌-2లు శిక్షణ పూర్తి చేసుకున్నారు. సర్వేకు సంబంధించిన పరీక్షలు 2022-23లో 5,096 మందికి ప్రభుత్వం నిర్వహించింది.
 

                                                   గ్రామ సర్వేయర్ల డిప్యుటేషన్లను రద్దు చేయాలి

ఒకవైపు భూముల రీసర్వే కార్యక్రమంలో పాల్గొంటూనే రోజువారీ విధులు నిర్వహించాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని గ్రామ సర్వేయర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రీ సర్వే పేరుతో కొందరిని సుదూర ప్రాంతాలకు డిప్యూటేషన్లు వేశారని, తాము పనిచేస్తున్న గ్రామాల్లో కూడా రీ సర్వే జరుగుతున్న నేపథ్యంలో డిప్యుటేషన్లు రద్దు చేయాలని గ్రామ సర్వేయర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. రీ సర్వే చేసే సిబ్బందికి కావాల్సిన స్టేషనరీ ఖర్చులు ప్రభుత్వం ఇవ్వకపోవడంతో సొంత డబ్బులు వెచ్చించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

44