- ముంబయి రికార్డును సమం చేసిన చెన్నై
అహ్మదాబాద్ : చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్‌పై స్పందించాడు. తాను ఫిట్‌గా ఉన్నంతకాలం ఐపిఎల్‌లో ఆడతానని, ఇప్పట్లో రిటైర్మెంట్ ఆలోచనే తన మదిలో లేదని చెప్పుకొ చ్చాడు. సోమవారం జరిగిన ఐపిఎల్ సీజన్-16 ఫైనల్లో గుజరాత్‌పై సంచలన విజయం సాధించిన అనంతరం టైటిల్ అందుకొంటూ ధోనీ ఈ వ్యాఖ్యలు చేశాడు. 'ఐపిఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇదే తగిన సమయమైనా.. అభిమానుల మద్ద తు, వారి ప్రేమ నుంచి దూరంగా వెళ్లడానికి నా మనసు అంగీకరించడం లేదు.. మరో తొమ్మిది నెలలు కష్టపడి రాబోయే ఐపిఎల్‌లో ఆడడానికి ప్రయత్నిస్తా..' అన్నాడు. వర్షం కారణంగా 15 ఓవర్లలో 171పరుగులు చేయాల్సిన చెన్నై జట్టును రవీంద్ర జడేజా చివరి రెండు బంతులను సిక్స్, ఫోర్ కొట్టి అద్భుత విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే.

ధోని రికార్డు
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మరో ఘనత సాధించాడు. ఐపిఎల్‌లో 250 మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఇందులో ఎక్కువగా సీఎస్‌కే తరఫున ఆడిన ధోనీ.. రైజింగ్ పుణె సూపర్‌జెయింట్‌కూ ప్రాతినిధ్యం వహించాడు. ధోనీ తర్వాత రోహిత్ శర్మ(243మ్యాచ్‌లు), దినేశ్ కార్తీక్(242)ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక చెన్నై జట్టు ఐదోసారి టైటిల్ అందుకొని అత్యధిక టైటిళ్లు నెగ్గిన ముంబయి పేర రికార్డును సమం చేసింది.
పోరాడినా ఫలితం దక్కలేదు: హార్దిక్
''మేం జట్టు పరంగా అద్భుతంగా ఆడాం. చివరి వరకు విజయం కోసం కష్టపడ్డాం. పోరాడిన తీరు గర్వంగా ఉంది. గెలిచినా.. ఓడినా మా జట్టు విధానం ఒకేలా ఉంటుంది. సాయి సుదర్శన్ సూపర్ బ్యాటింగ్ చేశాడు. అయితే, సీఎస్‌కే అద్భుతంగా ఆడింది. మోహిత్, రషీద్, షమీ అందరూ నాణ్యమైన బౌలింగ్ వేశారు. ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని సీఎస్‌కే టైటిల్‌ను గెలవడం ఆనందంగా ఉంది. మంచి వాళ్లకు మంచే జరుగుతుంది'' అని గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు.











