- ప్రభుత్వ దుర్మార్గాలు, దోపిడీని అసెంబ్లీలో ఎండగడతాం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుపై అసెంబ్లీలో గళమెత్తాలని ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశం (టిడిఎల్‌పి) నిర్ణయం తీసుకుంది. సమావేశాలు జరగనున్న ఐదురోజులు చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలనే డిమాండే ప్రధాన అజెండాగా టిడిపి వ్యవహరించనుంది. టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కె అచ్చెన్నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పొలిట్‌బ్యూరో సభ్యులు నందమూరి బాలకృష్ణ, శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఆధ్వర్యంలో టిడిఎల్‌పి సమావేశం బుధవారం జరిగింది. టిడిపి కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి లోకేష్, బాలకృష్ణ తదితరులు ఆన్‌లైన్‌లో హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణను ప్రభుత్వం అపహాస్యంగా మార్చిందని సమావేశం అనంతరం ఎమ్మెల్సీ బిటి నాయుడు, ఎమ్మెల్యేలు డోలా వీరాంజనేయస్వామి, నిమ్మల రామానాయుడు అన్నారు. చంద్రబాబుపై ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులు, వాటివెనకున్న కుట్రలను బయటపెట్టి అసెంబ్లీ సాక్షిగా వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని ఏకాభిప్రాయానానికి వచ్చామని చెప్పారు. పాలకులు పెట్టిన అక్రమ కేసులు ముమ్మాటికీ రాజకీయ ప్రేరేపితాలేనని ప్రజలకు తెలియజేస్తామన్నారు. జగన్ ఇసుక దోపిడీ, లిక్కర్ మాఫియా, భూకుంభ కోణాలు, ఖనిజాల దోపిడీతో పాటు, దళితులు, బిసిలు, మైనార్టీలు, ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న దాడులు, వేధింపులు, అఘాయితాల్యను ప్రజలకు వివరిస్తామన్నారు.
ప్రతిపక్షాన్ని, నేతలను అంతం చేయాలన్న దుర్మార్గపు ఆలోచనలతో ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆగ్రహించారు. 38 కేసుల్లో నిందితుడిగా, 158 స్టేలు తెచ్చుకున్న జగన్ నీతి, నిజాయతీలకు మారు పేరైన చంద్రబాబును అన్యాయంగా జైలుకు పంపారని విమర్శించారు. వైసిపి పాలనతో నష్టపోయిన అన్ని వర్గాల సమస్యలనూ చట్టసభల్లో ప్రస్తావిస్తామన్నారు. ప్రజాగళం అసెంబ్లీలో వినిపించకుండా ప్రతిపక్ష సభ్యుల్ని అడ్డుకుంటున్న పాలకపక్ష తీరును నిలువరిస్తూ గట్టిగా పోరాడాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. సంఖ్యాబలంలో తక్కువైనా ప్రజాబలంలో తమదే పైచేయి అని పేర్కొన్నారు.










