Nov 20,2022 21:32

శాన్‌ఫ్రాన్సిస్కో: ట్విటర్‌లో మార్పులకు అనుగుణంగా కష్టపడి పనిచేయాలని మస్క్‌ ఇటీవల ఉద్యోగులకు సూచించారు. ఈ మేరకు లిఖితపూర్వక హామీని ఇవ్వాలని కోరారు. లేదంటే వెళ్లిపోవాలని ఆయన ఇటీవల అల్టిమేటం జారీ చేశారు. దీన్ని వ్యతిరేకించిన ఉద్యోగులు చాలా మంది రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. వీరిలో చాలా మంది టెక్‌ విభాగం నుంచే ఉన్నట్లు సమాచారం. తాజాగా మస్క్‌ సేల్స్‌, పార్ట్‌నర్‌షిప్‌ విభాగం నుంచి తొలగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఈ మేరకు ఆయా విభాగాధిపతుల సమ్మతి కోరుతూ మస్క్‌ లేఖ రాసినట్లు బ్లూమ్‌బెర్గ్‌ తెలిపింది. కానీ, సేల్స్‌ విభాగాధిపతి రాబిన్‌ వీలర్‌, పార్ట్‌నర్‌షిప్స్‌ విభాగాధిపతి మ్యాగీ సునీవిక్‌.. మస్క్‌ ప్రతిపాదనను తిరస్కరించినట్లు సమాచారం. ఫలితంగా వీరివురిని మస్క్‌ ఉద్యోగం నుంచి తొలగించినట్లు కంపెనీలోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వాస్తవానికి వీలర్‌ గతనెలలోనే కంపెనీ వీడేందుకు సిద్ధమవ్వగా.. యాజమాన్యం ఆమెను బుజ్జగించి ఉండేందుకు ఒప్పించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ట్విటర్‌లో మార్పుల నేపథ్యంలో దూరమైన ప్రకటనదారులతో మాట్లాడేందుకు మస్క్‌కు వీలరే సహకరించినట్లు సమాచారం