Apr 28,2023 09:56
  • హెడ్‌ ఆఫ్‌ అకౌంట్‌పై గందరగోళంలో అధికారులు
  • వేసవి పనుల నిర్వహణ ఆర్‌డబ్ల్యుఎస్‌కు
  • నిధులు విపత్తుల శాఖకు
  • ఇప్పటికీ అకౌంటు లేని ఆర్‌డబ్ల్యుఎస్‌

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : వేసవిలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం రూపొందించే యాక్షన్‌ ప్లానుకు నిధుల కేటాయింపు ఎవరు చేయాలనే అంశంపై పైస్థాయి అధికారుల్లోనే తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ ఏడాది సుమారు రూ.95 కోట్లతో ప్లాను రూపొందించినప్పటికీ నిధులు ఎవరి ఖాతాలో వేయాలనేది ఇప్పటికీ స్పష్టత లేదు. నిధులు లేక ప్లాను అనుమతి పొందకపోవడం ఒకెత్తయితే, ఒకవేళ ఇస్తే ఎవరికి ఇవ్వాలనేది ఇప్పటికీ అంతకుచిక్కని ప్రశ్నగా మారింది. వేసవి యాక్షన్‌ప్లాన్‌లో ఇప్పటికీ గ్రామీణ నీటి పారుదల విభాగానికి హెడ్‌ ఆఫ్‌ ది అకౌంట్‌ లేకపోవడం విచిత్రం.
        ప్రస్తుతం గ్రామీణ తాగునీటి సరఫరా విభాగానికి నిధులు ఇవ్వడానికి హెడ్‌ ఆఫ్‌ది అకౌంట్‌ లేదు. వేసవిలో యాక్షన్‌ ప్లాను రూపొందించేది ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎక్కడ నీటి అవసరం ఉంది? అక్కడకు ఎంత సరఫరా చేయాలి? ఎలా చేయాలనే అంశాలన్నిటినీ ప్లాను రూపొందిస్తుంది. గతంలో నేరుగా ఆర్‌డబ్ల్యుఎస్‌కు నిధుల కేటాయింపు ఉండేది. గత ప్రభుత్వ హయాంలో వేసవి యాక్షన్‌ ప్లానును విపత్తులశాఖలోకి మార్చారు. నిధులు విపత్తులశాఖ నుండి కలెక్టర్లకు పంపిస్తున్నారు. జిల్లాల వారీ అవసరమైన నిధులు వారే విడుదల చేసే విధంగా వ్యవస్థలో మార్పులు చేశారు. వాస్తవంగా రాష్ట్రంలో వేసవి యాక్షన్‌ ప్లాను రూపొందించాల్సింది గ్రామీణ నీటిపారుదలశాఖ. ఎక్కడ ఎన్ని ట్యాంకర్లు పెట్టాలనేది అంచనా వేసేది కూడా ఆ విభాగమే. కొత్తగా రూపొందించిన విధానంలో ప్రణాళిక అంతా ఆర్‌డబ్ల్యుఎస్‌ చేస్తే కలెక్టర్లు అమలు చేయాలి. దీనికి సంబంధించి హెడ్‌ ఆఫ్‌ది అకౌంట్‌ నేరుగా విపత్తుల శాఖకే కేటాయించారు. విపత్తులశాఖకు జిల్లాస్థాయిలో కలెక్టరే ప్రధాన అధికారి. నీటిని సరఫరా చేసిన తరువాత ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులు వివరాలను కలెక్టర్లకు పంపించాల్సి ఉంటుంది. వారు నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది. దీనిపై అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కేటాయింపులూ ఆర్‌డబ్ల్యుఎస్‌కు చేస్తే నేరుగా పర్యవేక్షణ చేస్తామని, ఇప్పుడు ప్లాను రూపొందించడం, అమలు కోసం కలెక్టర్‌ వద్దకు వెళ్లడం ఆమోదించడం పెద్ద తతంగంగా ఉందని, పైగా నిర్వహణ ఒకరు, పర్యవేక్షణ ఒకరు చేయడం పనుల నిర్వహణలో జాప్యానికి కారణం అవుతుందని అంటున్నారు.
 

                                                                            అడిగేది ఎవరు ?

ప్రస్తుతం నీటి సరఫరాకు సంబంధించి ఆర్‌డబ్ల్యుఎస్‌ ప్లాను రూపొందించిన తరువాత నిధుల కేటాయింపు విపత్తులశాఖకు కేటాయించడంతో అసలు పని ఎవరు చేయాలి, నిధులు ఎవరిని ఏ శాఖ అడగాలనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్లాను రూపొందించిన వారే అంచనాలు వేస్తారని, వారే పూర్తి అనుమతులు తీసుకుంటారని విపత్తులశాఖ అధికారులు చెబుతున్నారు. నిధులు విపత్తులశాఖకు ఇస్తున్నారని ఇచ్చారో లేదో తెలియక అడగాలో లేదో కూడా స్పష్టత ఉండటం లేదని ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులు అంటున్నారు. రెండు విభాగాల మధ్య గరదరగోళం నెలకొనడంతో ప్రభుత్వం కూడా నిధుల విడుదలలో జాప్యం చేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.