ప్రజాశక్తి-మండపేట (అంబేద్కర్ కోనసీమ) : తల్లిదండ్రులు లేని ఎలాంటి ఆధారం లేకుండా ఒంటరిగా ఉంటున్న 18 సంవత్సరాలలోపు బాల బాలికల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మిషన్ వాత్సల్య ప్రోగ్రామ్ కు అర్హులైనవారు దరఖాస్తు చేసుకోవాలని కపిలేశ్వరపురం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సీడీపీఓ ఏ.గజలక్షి ఆదివారం ఓ ప్రకటనలో తెలియజేశారు. ఇందుకు సంబందించి మార్గదర్శకాలు తెలిపారు. తల్లి లేదా తండ్రి లేని18 సంవత్సరాలలోపు చిన్న పిల్లల వివరాలు ఎవరి సమీపంలోనైనా ఉన్నట్లు తెలిస్తే వెంటనే అంగన్వాడీ టీచర్‌కు ఆ విషయాన్ని తెలిపాలి. ఆ చిన్నారులకు కేంద్ర ప్రభుత్వం నెలకి రూ.4,000 వరకు డబ్బులు ఇస్తుంది. దరఖాస్తుకు కావలసిన పత్రాలేవంటే ... తల్లి లేదా తండ్రి చనిపోతే డెత్ సర్టిఫికెట్, తల్లిదండ్రుల విడాకుల పత్రాలు, విడిగా ఉన్నట్లయితే స్థానిక వి.ఆర్.ఓ. లెటర్, తల్లి, తండ్రి, బిడ్డ ఆధార్ కార్డులు, బిడ్డ పుట్టిన తేదీ సర్టిఫికెట్, గార్డియన్ కానీ, తల్లి గాని తండ్రి గాని ఎవరు ఉంటే వాళ్ళతో బిడ్డకు జాయింట్ బ్యాంక్ అకౌంట్ లేదా బిడ్డ పేరున అకౌంట్ వున్నా పరవాలేదు. ఇద్దరు పిల్లలైతే రెండు బ్యాంక్ అకౌంట్లు ఉండాలి. మరిన్ని వివరాలకు గ్రామ స్థాయిలో అంగన్వాడీ గ్రామ సచివాలయాలో సంప్రదించి దరఖాస్తులు పొంది సకాలంలో పూర్తిచేసి కపిలేశ్వరపురం సిడిపిఓ కార్యాలయంలో అందజేయాలని సీడీపీఓ వివరించారు.










