Jul 17,2023 10:46
  • వచ్చింది రూ.5,930 కోట్లు
  • కేటాయించింది రూ.7,186 కోట్లు
  • రెండేళ్లలో ఇచ్చింది రూ.379 కోట్లే

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : పంచాయతీల నిధుల విషయంలో ఇప్పటికీ స్పష్టత కరువైంది. రాష్ట్రం నుంచి గత రెండేళ్లలో పంచాయతీలకు రూ.379 కోట్లు మాత్రమే వచ్చాయని సర్పంచులు చెబు తున్నారు. ఈ ఏడాది రూ.336 కోట్లకు ప్రొడీసింగ్స్‌ ఇచ్చినా ఇప్పటివరకు జమకాలేదు. దీనిపై సర్పంచులు ఆగ్రహంతో ఉన్నారు. రాష్ట్రవ్యాప్త ఆందోళనకు సిద్ధమవుతున్నారు. 2019లో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మొత్తం రూ.7186 కోట్లు నిధులు కేటాయించారు. వాటిల్లో రూ.5930 కోట్లు విడుదల చేశారు. కానీ పంచాయతీలకు ఆ నిధులు జమకాలేదు. ఖాతాల్లో వేసినట్లే వేసి వెనక్కు తీసుకున్నారు. పంచాయతీ తీర్మానం లేకుండా సర్పంచుల సంతకం లేకుండా నిధులు వెనక్కు తీసుకోవడం సరికాదు. అలా చేయడం సైబర్‌ నేరం కిందకు వస్తుందని న్యాయవాదులు చెబుతున్నారు. గత రెండేళ్లలో కేవలం రూ.379 కోట్లే పంచాయతీలకు ఇచ్చారు. ఈ ఏడాది రూ.336 కోట్లకు ప్రొడీసింగ్స్‌ ఇచ్చినా ఇంతవరకూ వారి ఖాతాల్లో జమ కాలేదు. వాస్తవంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి 14వ ఆర్థిక సంఘం కింద కేటాయింపులు, విడుదలను పరిశీలిస్తే 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.2622.13 కోట్లు కేటాయించి రూ.2336.56 కోట్లు విడుదల చేశారు. 2020-21 సంవత్సరంలో రూ.2625 కోట్లు కేటాయించి రూ.2,625 కోట్లు ఇచ్చారు. 2021-22 ఆర్థిక సంవత్సరం లో రూ.1939 కోట్లు కేటాయించి రూ.969 కోట్లు విడుదల చేశారు. అంటే మొత్తంగా రూ.5930 కోట్లు ఇచ్చేశారు.
 

                                                                    నిధుల కోసమే గత ఎన్నికలు

వాస్తవంగా పంచాయతీరాజ్‌కు సంబంధించి ఎన్నికలు నిర్వహించకపోతే చట్ట ప్రకారం రావాల్సిన నిధులు విడుదల చేయదనే పేరుతో వైసిపి ప్రభుత్వం అప్పటికప్పుడు ఏర్పాట్లు చేసి పంచాయతీ ఎన్నికలకు సిద్ధమైంది. కోర్టు కేసులు రావ డంతో కేంద్ర నిధులు రావని, అభివృద్ధి కుంటుపడుతుందని, అందువల్లే ఎన్నికల నిర్వహణ అత్యవసరమని ప్రభుత్వం తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. స్థానిక పాలక మండళ్ల ఏర్పాటు ద్వారానే సుస్ధిర పాలన సాధ్యమవుతుందనీ వక్కాణించారు. ఇప్పుడు నిధుల కేటాయింపుపై మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఒకవైపు ఇచ్చినట్లే ఇచ్చి విద్యుత్‌ బకాయిలకు జమేసుకున్నామని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ప్రకటించారు. అయితే జమకు సంబంధించిన రశీదులు ఇంతవరకు పంచాయతీలకు అందలేదు. పైగా బకాయిలకు వడ్డీలు, చక్రవడ్డీలు వేసి బిల్లులు ఇస్తున్నారు. దీనిపై సర్పంచులూ ఆగ్రహంతో ఉన్నారు. విద్యుత్‌ బకాయిలు జమేసుకుంటే బకాయిలు కట్టాలని విద్యుత్‌ శాఖ ఎందుకు బిల్లులు ఇస్తుందని ప్రశ్నిస్తున్నారు. గుంటూరు జిల్లాలో పలు పంచాయతీల సర్పంచులు ఇటీవల విద్యుత్‌శాఖ అధికారులను కలిశారు. పంచాయతీరాజ్‌శాఖ బిల్లులు కట్టామని చెబుతోందని, ఇంకా బకాయి ఏమిటని ప్రశ్నించగా తమకు జమైనట్లు ఇంతవరకు ఎటువంటి ఆధారమూ లేదని విద్యుత్‌శాఖ అధికారులు సమాధానం ఇచ్చారని, సర్పంచుల సంఘం నాయకులు పాపారావు తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి పంచాయతీల కోసం ఇచ్చిన నిధులు ఏమయ్యాయనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. నిధుల కోసం ఎన్నికల నిర్వహిస్తున్నా మని చెప్పిన ప్రభుత్వం ఆచరణలో నిధులను పంచాయతీ లకు జమచేయకపోవడం విశేషం.