Jan 10,2023 08:59

న్యూఢిల్లీ : లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసి), కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంలోని ఐడిబిఐ బ్యాంక్‌ వాటాలను 2023-24 ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి విక్రయిస్తామని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ (దీపమ్‌) సెక్రటరీ తూహిన్‌ కాంత్‌ పాండే తెలిపారు. ఐడిబిఐ బ్యాంక్‌ విక్రయానికి ఈ నెల 7వ తేదీ వరకూ దరఖాస్తులను స్వీకరించగా, దేశీయ సంస్థలతోపాటు విదేశీ పెట్టుబడిదారులు పోటీపడుతున్నారని ఆయన ఓ ఇంటర్యూలో తెలిపారు. ఈ డాక్యుమెంట్లను ఆర్‌బిఐకి సమర్పించినట్లు చెప్పారు. వాటాల విక్రయం తర్వాత కేంద్ర ప్రభుత్వానికి కనీస లేదా మైనారిటీ వాటానే ఉంటుందన్నారు. ఐడిబిఐలోని మెజారిటీ 60.72 శాతం వాటాలను విక్రయించేందుకు మోడీ సర్కార్‌ పలు నిబంధనలను సవరించింది. ప్రస్తుతం ఈ బ్యాంక్‌లో ఎల్‌ఐసికి, కేంద్రానికి కలిపి 95 శాతం వాటా ఉంది. ఎల్‌ఐసికి 49.24 శాతం, ప్రభుత్వానికి 45.48 శాతం, నాన్‌ ప్రమోటర్‌ షేర్‌హోల్డర్లకు 5.29 శాతం చొప్పున వాటాలున్నాయి. కొనుగోలు చేసే ప్రయివేటు, కార్పొరేట్‌ శక్తులకు పన్నుల్లో రాయితీ ఇవ్వాలని మోడీ సర్కార్‌ భావిస్తోంది.