Oct 08,2023 16:52

నల్లగొండ : దశాబ్దాల కాలంగా చేపల విక్రయానికి సరియైన మార్కెట్‌ లేక ఎండనక, వాననక రోడ్లపై విక్రయిస్తున్న మత్స్యకారుల కుటుంబాలకు ప్రత్యేకంగా చేపల మార్కెట్‌ నిర్మిస్తామని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌ రెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండ గంగపుత్ర ఫిషర్‌మెన్‌ కమ్యూనిటీకి చెందిన దాదాపు 100 మంది ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మత్య్సకారుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వమే ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేయడంతో మత్స్యకారులు ఆర్థికంగా బల పడ్డారన్నారు. నల్లగొండ పట్టణంలో చేపలు విక్రయించడానికి ఆధునిక వసతులతో చేపల మార్కెట్‌ నిర్మిస్తామని హామీనిచ్చారు.వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను మరోసారి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం గౌరవ అధ్యక్షుడు సింగం రామ్మోహన్‌, అధ్యక్షుడు మునసు ప్రసన్న, వడ్డెపోయిన ఆంజ నేయులు,మంగలిపల్లి శంకర్‌, గుండు అంజయ్య, సింగం శ్రీనివాస్‌, అంబటి అనురాధ, సుగుణమ్మ, గంగుల హిమరాణి, అంబటి గంగాభవాని, శబరి, పద్మ, సైదమ్మ, తదితరులు పాల్గొన్నారు.