Jun 04,2023 08:54

ప్రజాశక్తి-యంత్రాంగం : 'చాలా భయం వేసింది. ఒక్కసారిగా వచ్చిన పెద్ద శబ్దానికి అందరమూ భయంతో పరుగులు తీశాం. కొద్దిసేపటికి మేము మా బ్యాగులు తీసుకొని బయటికి వచ్చేశాం. అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితిలో మేమున్నాము. రైలు ప్రమాదంలో ఎన్ని రైళ్లు ఢకొీన్నయన్నది కూడా మాకు తెలియలేదు. కొద్దిసేపటికి రైల్వే అధికారులు, అంబులెన్సులు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను భువనేశ్వర్‌ ఆస్పత్రికి తరలించారు. నేను మాత్రం ఒంటరిగా కిలోమీటరు దూరం నడిచి వెళ్లాను. అక్కడ నుండి బస్సులో భువనేశ్వర్‌ చేరుకున్నాను. అక్కడ నుంచి ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో ఏలూరు వచ్చాను' అంటూ... ఏలూరుకు చెరదిన పిల్లి శ్రీకర్‌బాబు తన భయానక అనుభవాన్ని మీడియాకు తెలియజేశారు. ఏలూరు పట్టణంలోని లక్ష్మీనగర్‌ ప్రాంతానికి చెందిన ఆయన కోల్‌కత్తాలో ఇండియన్‌ స్టాటికల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో బ్యాచిలర్‌ ఆఫ్‌ స్టాటస్టిక్స్‌ డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నారు. సెలవులు ఇవ్వడంతో కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఏలూరు వచ్చేందుకు శుక్రవారం మధ్యాహ్నం షాలిమార్‌లో ఎక్కాడు. రాజమండ్రికి చెందిన సీనియర్లు అదే రైలులో ఉన్నారు. సీనియర్‌ గోరక్‌ చందుపాల్‌కు గాయాలు కావడంతో భువనేశ్వర్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
 

స్వల్ప గాయాలతో బయటపడ్డాం

'మేమంతా బి-5 ఎసి బోగీలో ప్రయాణిస్తున్నాం. ఒక్కసారిగా బోగీలు పల్టీలు కొట్టాయి. మా బోగీ మాత్రం కుదుపునకు గురైంది. స్వల్పగాయాలతో బయటపడ్డాం' అని పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం కొత్త పనుకువలసకు చెందిన కాదూరి లోకేష్‌, ఆయన తల్లి అక్కమ్మ, భార్య విన్ని, పిల్లలు హేమంత్‌, కరిష్మా తెలిపారు. వీరంతా కోల్‌కత్తా నుంచి కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో విశాఖ వస్తున్నారు. ప్రథమ చికిత్స అనంతరం ప్రత్యేక రైలులో రైల్వే అధికారులు వారిని విశాఖ తీసుకొచ్చారు.
 

తిరుపతి వాసులంతా క్షేమం

తిరుపతి స్టేషన్‌ నుంచి 18 మంది, రేణిగుంట నుంచి 8 మంది, గూడూరు నుంచి ఇద్దరు కలిపి మొత్తం 28 మంది కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించారని తిరుపతి ఎంపి గురుమూర్తి తెలిపారు. వీరంతా సురక్షితంగా ఉన్నారని ఆయన చెప్పారు.
 

విశాఖ జిల్లా యంత్రాంగం, రైల్వే అధికారుల మధ్య సమన్వయ లోపం

విశాఖకు చెందిన వారు ఫస్ట్‌ ఎసిలో ముగ్గురు, సెకండ్‌ ఎసిలో 14 మంది, థర్డ్‌ ఎసిలో 71 మంది, స్లీపర్‌ క్లాస్‌లో 22 మంది వెరసి 110 ప్రయాణిస్తున్నారని రైల్వే శాఖ అధికారులు తెలియజేయగా, విశాఖపట్నం కలెక్టరేట్‌లో ఎపి విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇచ్చిన గణాంకాలు దానికి భిన్నంగా ఉన్నాయి.
 

సరైన సమాచారం లేదు

కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదానికి సంబంధించి అన్ని రైల్వే స్టేషన్లలోనూ హెల్ప్‌లైన్‌ సెంటర్లు ఏర్పాటు చేసినప్పటికీ ఎక్కడా సరైన సమాచారం లభించడం లేదు. ఏయే రైళ్లు రద్దు అయ్యాయి? ఏ రైలు ఎప్పుడు వస్తుంది? అనే సమాచారం కూడా లభించలేదు. దీంతో, శుక్రవారం రాత్రి నుంచి వందలాది మంది ప్రయాణికులు విశాఖతో పాటు పలు రైల్వే స్టేషన్లలో ఇబ్బందులు పడ్డారు విశాఖపట్నానికి చెందిన వారు ఎంతమంది రిజర్వేషన్‌ చేసుకున్నారనే వివరాలు తప్ప, మరే ఇతర వివరాలూ అధికారుల వద్ద లేవు. స్వల్ప గాయాలతో బయటపడిన 245 మందితో బయలుదేరిన ప్రత్యేక రైలు నుంచి విశాఖలో పది మంది మాత్రమే దిగారు. వారిని ప్రధాన మార్గం నుంచి కాకుండా పక్క మార్గం నుంచి రైల్వే అధికారులు తరలించడంపై విమర్శలు వస్తున్నాయి.