- మూడేళ్లుగా రైతులకు డబ్బులు చెల్లించని కేంద్రం
- విస్తరణకు ఆటంకంగా మారిన ప్రభుత్వ తీరు
ప్రజాశక్తి-శ్రీకాకుళం ప్రతినిధి : కొబ్బరి రైతులకు చెల్లించాల్సిన రాయితీ డబ్బులకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. కొబ్బరి తోటల విస్తరణ, అభివృద్ధికి కోకోనట్ డెవలప్‌మెంట్ బోర్టు ద్వారా రైతులకు దక్కాల్సిన సాయం మూడేళ్లగా అందడం లేదు. రాయితీ సొమ్ము కోసం కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో, కొబ్బరి సాగు విస్తరణకు ఆటంకంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా 3.8 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగవుతోంది. కోనసీమ జిల్లాలో అత్యధిక 2.5 లక్షల ఎకరాల్లో సాగులో ఉంది. కొబ్బరి సాగును మరింత పెంచేందుకు రాష్ట్రంలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం నర్సరీలను ఏర్పాటు చేసింది. కోకోనట్ డెవలప్‌మెంట్ బోర్డు ద్వారా రైతులకు ఏటా రాయితీ అందించాల్సి ఉంది. ఆయా ప్రాంతాల్లో బోర్డు ఆర్థిక సాయంతో నడుస్తోన్న నారుమడి క్షేత్రాల్లో రైతులు కొబ్బరి మొక్కలను కొనుగోలు చేస్తే అందులో 2/3వ వంతు రాయితీగా ఇచ్చేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తూ వస్తోంది. విస్తరణ పథకం కోసం రైతులకు కొబ్బరి మొక్కలను అందించేందుకు రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా బారువ, విజయనగరం జిల్లా బొబ్బిలి, సోమలింగాపురంలోని శ్రీ సూర్య చంద్రరాజు మోడల్ నర్సరీ, తూర్పుగోదావరి జిల్లా వీరహనుమాన్ నర్సరీ, పశ్చిమగోదావరి జిల్లా విజయరాయిలోని హార్టికల్చర్ రీసెర్చి స్టేషన్, వేగివాడ నర్సరీలను బోర్టు ఏర్పాటు చేసింది. వీటిలో కొబ్బరి మొక్క రకాన్ని బట్టి రూ.60 నుంచి 80కు రైతులకు అమ్ముతారు. రైతులకు కేంద్ర ప్రభుత్వం రూ.40 నుంచి రూ.50 వరకు రాయితీ అందించాల్సి ఉంది. రాయితీ సొమ్ము గత మూడేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు.
ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే రూ.40 లక్షల బకాయిలు
శ్రీకాకుళం జిల్లాలో బారువ నారుమడి క్షేత్రం నుంచి రైతులు ఒక్కో కొబ్బరి మొక్క రూ.60కు కొనుగోలు చేశారు. రాయితీగా కేంద్ర ప్రభుత్వం రూ.40 చెల్లించాల్సి ఉంది. మొదటి సంవత్సరం రూ.21, రెండో ఏడాది రూ.19 చొప్పున ఇవ్వాల్సి ఉంది. రైతులు కొబ్బరి నారుమడి క్షేత్రం నుంచి కొనుగోలు చేసిన మొక్కలకు కోకోనట్ డెవలప్‌మెంట్ బోర్టు వారి ఖాతాల్లో నగదును జమ చేయాలి. శ్రీకాకుళం జిల్లాలో గత మూడేళ్ల కాలంలో సుమారు లక్ష మొక్కలకు సంబంధించి రాయితీ కింద రూ.40 లక్షలు కేంద్రం నుంచి విడుదల కాలేదు. 2019-20లో 600 ఎకరాలు, 20-21లో 625 ఎకరాలు, 21-22లో 500 ఎకరాలకు డబ్బులు రావాల్సి ఉంది.











