Jul 11,2023 10:46
  • గంగవరంలో అదానీ పోర్టు బరితెగింపు !

ప్రజాశక్తి - గ్రేటర్‌ విశాఖ బ్యూరో : విశాఖ సముద్ర తీరంలో గంగవరం పోర్టు పేర రూ.వేల కోట్ల విలువైన సంపదను కొల్లగొట్టిన ప్రయివేటు వ్యక్తులు నేడు కార్మికుల శ్రమదోపిడీకి పాల్పడుతున్నారు. పెట్టుబడిదారుల కోసం కార్మిక చట్టాలు, హక్కులను సైతం ప్రభుత్వాలు ఎలా కాలరాస్తున్నాయో చెప్పేందుకు ఒక ఉదాహరణే ప్రస్తుతం విశాఖపట్నం జిల్లా గంగవరం పోర్టులో అదానీ బరితెగింపు వ్యవహారం. దేశంలోనే అత్యంత లోతైన, అత్యాధునిక నౌకాశ్రయం అదానీ గంగవరం ఓడరేవు. వైజాగ్‌ ఇండిస్టియల్‌ - గాజువాక ఏరియా వెనుక గల సముద్రతీర ప్రాంతంలో సగభాగం ఈ పోర్టు ఆక్రమించింది. ఈ పోర్టు కోసం వందల ఎకరాల భూములు త్యాగం చేసిన రైతులు, కార్మికుల శ్రమను నిరంతర దోపిడీ చేస్తోంది. ఏపి ప్రభుత్వం 2021లో గంగవరంలో తన వాటా 10.04శాతాన్ని వదులుకుని అదానీకి కట్టబెట్టేసింది. 15 ఏళ్ల క్రితం కార్మికులు ఉద్యోగంలో చేరినప్పుడు ఇచ్చిన వేతనం రూ.3500 నేటికీ యాజమాన్యం కొనసాగిస్తోంది.
 

                                                             గంగవరం పోర్టుకు భూ కేటాయింపులు

గంగవరం ప్రయివేట్‌ పోర్టుకు సంబంధించి 2000 దశకంలో డివిఎస్‌ఎన్‌ రాజుకు అప్పట్లో ప్రభుత్వాలు కారుచౌకగా భూములు కేటాయించాయి. పోర్టు కోసం ప్రభుత్వం 2500 ఎకరాల భూమిని కేటాయించింది. మత్స్యకారుల జెట్టీని అర్ధాంతరంగా తొలగించి మరీ సముద్ర తీరాన్ని ప్రయివేట్‌ వ్యక్తికి కట్టబెట్టింది. 20 వేల మంది మత్స్యకారుల కుటుంబాల జీవనంపై ఈ ప్రభావం నాటినుంచీ ఉంది. ఇక్కడ తొమ్మిది బెర్తులున్నాయి. బొగ్గు, ఇనుప ఖనిజం, ఎరువులు, సున్నపురాయి, బాక్సైట్‌, పంచదార, అల్యూమినియం, ఉక్కు ఎగుమతి, దిగుమతులు ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున సాగుతూ దేశంలోనే ప్రభుత్వ పోర్టులను దాటేలాగ గంగవరం పోర్టు కార్గో చేపడుతోంది.
 

                                                                      పేరుకే పర్మినెంట్‌ కార్మికులు

గంగవరం పోర్టులో వేల సంఖ్యలో పర్మినెంట్‌ కార్మికులున్నారు. వీరు పేరుకు మాత్రమే పర్మినెంట్‌ కార్మికులు, ఉద్యోగులు. కనీసం స్టీల్‌ప్లాంట్‌ కాంట్రాక్టు కార్మికులకు ఇచ్చే జీతాలు కూడా వీరికి యాజమాన్యం చెల్లించడం లేదు. దీంతో గంగవరం పోర్టు కార్మికులు గడచిన కొద్దిరోజుల నుంచీ ఆందోళన బాటపట్టారు. సిఐటియు వీరికి బాసటగా నిలిచింది. రెండు దఫాలుగా జిల్లా కలెక్టర్‌ వద్ద యాజమాన్య ప్రతినిధులు, కార్మిక ప్రతినిధులతో జరిగిన చర్చల్లోని సూచనలను సైతం యాజమాన్యం అమలు చేయకుండా తాత్సారం చేస్తోంది. షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ ప్రకారం వేతనాలు చెల్లిస్తూ కార్మికులను నిలువు దోపిడీ చేస్తోంది. ప్రభుత్వ రంగంలోని వైజాగ్‌ పోర్టు 7.5 మిలియన్‌ టన్నులే కార్గో చేస్తుండగా గంగవరం పోర్టు ప్రతి ఏడాది 10 మిలియన్‌ టన్నుల కార్గోయింగ్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలో కొన్ని నెలలుగా పోర్టు కార్మికులు వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నారు. ఈనెల10 నుంచి 13 వరకూ పెద్ద ఎత్తున నిరసన తెలిపేందుకు కార్మిక వర్గం సిద్దమైంది.