-వేలాదిగా తరలివచ్చిన కార్మికులు
-ఇసుప కంచెలను దాటుకుంటూ దూసుకెళ్లిన వైనం
-మా భూముల్లో నిర్మించిన పోర్టుపై అదానీ పెత్తనమేంటని ఆగ్రహం
-జీతాలు, ఇతర సమస్యలు పరిష్కరించే వరకూ పోరాటం
-పోలీసు నిర్బంధం, లాఠీఛార్జి
ప్రజాశక్తి- గాజువాక (విశాఖపట్నం):జీతాలు పెంచాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గంగవరం పోర్టు ఎంప్లాయీస్ యూనియన్, అఖిలపక్ష రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాల ఆధ్వర్యాన గురువారం తలపెట్టిన 'చలో అదానీ గంగవరం పోర్టు' కార్యక్రమానికి వేలాదిగా కార్మికులు కుటుంబాలతో తరలివచ్చారు. పోలీసులు తీవ్ర నిర్బంధం ప్రయోగించినా, లాఠీఛార్జి చేసినా వెరవకుండా ఇనుప కంచెలను దాటుకుంటూ పోర్టు మెయిన్ గేటు వద్దకు దూసుకెళ్లారు. తీవ్ర ఉద్రిక్తతల నడుమ పోర్టు ముట్టడి కార్యక్రమం సాగింది. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ సాగిన ఈ కార్యక్రమంలో అదానీ పోర్టు యాజమాన్యానికి వ్యతిరేకంగా కార్మికులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. తమ భూముల్లో పోర్టు కట్టి.. తమపైనే పెత్తనం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెదగంట్యాడలో నిర్వహిస్తోన్న దీక్షా శిబిరం నుంచి పోర్టు కార్మికులు మూడు కిలోమీటర్ల దూరంలోని పోర్టుకు మహా ప్రదర్శనగా బయలుదేరారు. పోలీసులు ఆ మార్గంలో మూడుచోట్ల ఇనుప కంచెలు, బారికేడ్లు ఏర్పాటు చేసి వారిని అడ్డుకోవడానికి తీవ్ర ప్రయత్నం చేశారు. అవేవీ కార్మికుల పోరును ఆపలేకపోయాయి. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డాక్టర్ బి.గంగారావు, బి.జగన్, నాయకులు కొవిరి అప్పలరాజు, వైసిపి గాజువాక ఇన్‌ఛార్జి తిప్పల దేవన్‌రెడ్డి, టిడిపి మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, జనసేన పార్టీ కార్పొరేటర్ దల్లి గోవింద కార్మికులకు మద్దతు తెలిపి వారిని ముందుకు నడిపించారు. ఈ క్రమంలో పోర్టుకు కిలోమీటరు సమీపంలో పోలీసులకు, కార్మికులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ సందర్భంగా పోలీసులు లాఠీఛార్జి చేశారు. దీంతో, కొందరి కార్మికులకు గాయాలయ్యాయి. ఇద్దరు మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. పోలీసులు ఎంత నిర్బంధం ప్రయోగించినా కార్మికులు వెనక్కి తగ్గకుండా పోర్టు మెయిన్ గేటు వరకూ దూసుకెళ్లారు. 'జీతాలైనా పెంచండి.. మా సముద్రాన్నైనా మాకు ఇచ్చేయండి' అంటూ పోర్టు మెయిన్ గేటును ముట్టడించి అక్కడ ధర్నా చేశారు. ఈ ధర్నాకు మాజీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, తిప్పల గురుమూర్తిరెడ్డి, చింతలపూడి వెంకట్రామయ్య మద్దతు తెలిపి మాట్లాడారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డాక్టర్ బి.గంగారావు మాట్లాడుతూ తక్షణమే కలెక్టర్ జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దీంతో, అక్కడకు ఆర్‌డిఒ హుస్సేన్ సాహెబ్ వచ్చారు. నాయకులతో మాట్లాడిన అనంతరం ఆయన పోర్టు యాజమాన్యంతోనూ చర్చించారు. అదానీ పోర్టు యాజమాన్యం కొన్ని సమస్యలను పరిష్కరిస్తుందంటూ ఆయన చెప్పుకురాగా, కార్మికులు సంతృప్తి చెందలేదు. అవసరమైతే గేటును బద్ధలు కొట్టుకుని లోపలకు వెళ్తామని నినదించారు. ఆర్‌డిఒ స్పందిస్తూ, సమస్యలను వినతిపత్రం రూపంలో తనకు ఇవ్వాలని కోరారు. దీంతో, ఆయనకు కార్మికులు వినతిపత్రం అందజేశారు. సమస్యల పరిష్కారానికి నాలుగు రోజుల సమయం కావాలని పోర్టు యాజమాన్యం కోరింది. దీంతో, కార్మికులు ఆందోళనను తాత్కాలికంగా విరమించారు. గడువులోగా సమస్యలను పరిష్కరించకుంటే మళ్లీ పోర్టును ముట్టడిస్తామని హెచ్చరించారు. పోర్టు ముట్టడి నేపథ్యంలో తలెత్తిన తోపులాటలో కొద్దిమంది పోలీసులకూ గాయాలయ్యాయి.
లాఠీఛార్జికి సిపిఎం, సిఐటియు ఖండన
కార్మికులపై పోలీసులు లాఠీఛార్జి చేయడాన్ని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్ ఖండించారు.










