Jul 26,2022 07:20

2021-22లో రూ.28,214 కోట్లు

రూ.913.19 కోట్లు లాభాలు

అయినా ప్రైవేటీకరిస్తాం :  కేంద్ర సహాయ మంత్రి కులస్తే
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :
ఉక్కు ఉత్పత్తి, అమ్మకం, టర్నోవర్‌లలో విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటు సరికొత్త రికార్డు సృష్టించింది. 2021-22లో రూ.28,214 కోట్ల వార్షిక టర్నోవరు సాధించిందని, 2020-21లో సాధించిన టర్నోవరుతో పోలిస్తే 57 శాతం వృద్ధి సాధించిందని ఉక్కుశాఖ సహాయ మంత్రి ఫగ్గన్‌ సింగ్‌ కులస్తే వెల్లడించారు. రాజ్యసభలో సోమవారం వైసిపి ఎంపి వి విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2020-21లో రూ.17,980.22 కోట్ల వార్షిక టర్నోవరు నమోదు చేసిన వైజాగ్‌ స్టీల్‌ ప్లాంటు 2021-22లో రూ.28,214.76 కోట్ల టర్నోవరు సాధించిందని తెలిపారు. స్టీల్‌ సుస్థిర విక్రయం 2020-21లో 4,415 టన్నులు జరిగితే, 2021-22లో 5,218 టన్నులు అమ్మకం జరిగిందని, 18 శాతం విక్రయం పెరిగిందని అన్నారు. ఉత్పత్తి కూడా 2020-21లో 4,163 టన్నులు జరిగితే, 2021-22లో 5,138 టన్నుల ఉత్పత్తి జరిగిందని, 23 శాతం ఉత్పత్తి పెరిగిందని తెలిపారు. టిడిపి ఎంపి కనకమేడల రవీంద్ర కుమార్‌ అడిగిన మరో ప్రశ్నకు వైజాగ్‌ స్టీల్‌ ప్లాంటు 2021-22లో రూ.913.19 కోట్లు లాభాలు ఆర్జించిందని కేంద్ర మంత్రి తెలిపారు.
నాన్‌-స్ట్రాటజిక్‌ సెక్టార్‌ యూనిట్లలో పెట్టుబడుల ఉపసంహరణ కోసం ప్రభుత్వం నూతన పబ్లిక్‌ సెక్టార్‌ ఎంటర్‌ప్రైజ్‌ (పిఎస్‌ఇ) పాలసీ-2021కి అనుగుణంగా ఆర్‌ఐఎన్‌ఎల్‌ (వైజాగ్‌) డిజిన్వెస్ట్‌మెంటు కోసం నిర్ణయం తీసుకున్నామని, ఉక్కు తయారీ నాన్‌-స్ట్రాటజిక్‌ రంగంలోకి వస్తుందని తెలిపారు. ఎంఎండిఆర్‌ చట్టంలోని 17ఎ (2ఎ) కింద ఒడిశా, చత్తీస్‌గఢ్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలను ఇనుప ఖనిజం కోసం కేంద్ర ప్రభుత్వం, ఆర్‌ఐఎన్‌ఎల్‌ అభ్యర్థించిందని మంత్రి తెలిపారు. ఉక్కు మంత్రిత్వశాఖ కూడా ఆర్‌ఐఎన్‌ఎల్‌కు అనుకూలంగా ఇనుప ఖనిజం బ్లాక్‌ను రిజర్వేషన్‌ కోసం ఒడిశా ప్రభుత్వాన్ని అభ్యర్థించిందని కేంద్ర మంత్రి తెలిపారు.
 

చిత్తూరులోని ఐఐటిలో 53 ఫ్యాకల్టీ పోస్టుల్లో 18 అధ్యాపక పోస్టులు ఖాళీ
చిత్తూరులోని శ్రీసిటీలో ఉన్న ఐఐటిలో 53 ఫ్యాకల్టీ పోస్టుల్లో 18 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని వైసిపి ఎంపిలు ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయలు, బాలశౌరి అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.

ఎపిలో సహజ వాయువు నిక్షేపాలు అపారం
ఆంధ్రప్రదేశ్‌లో సహజ వాయువు నిక్షేపాలు అపారంగా ఉన్నాయని పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్‌ తేలి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో వెలికితీయాల్సిన సహజ వాయువు నిక్షేపాలు 27 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల వరకు ఉండవచ్చునని అంచనా వేసినట్లు వైసిపి ఎంపి విజయసా యిరెడ్డి ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. పెట్రోలియం, గ్యాస్‌ వెలికితీసే రాష్ట్రాలకు చెల్లించే రాయ ల్టీని కేంద్ర ప్రభుత్వం సవరించే ప్రతిపాదన ఏదైనా ఉందా అన్న ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ప్రస్తుతానికి రాయల్టీని సవరించే ప్రతిపాదన ఏదీ లేదని తెలిపారు. 2003లో కేంద్రం చేసిన తీర్మానాన్ని అనుసరించి ఆ విలువను బట్టే రాయల్టీని నిర్ధారిస్తున్నట్లు మంత్రి తెలిపారు. క్రూడాయిల్‌, గ్యాస్‌పై రాష్ట్రాలకు చెల్లించే రాయల్టీని 2004లో సవరించినట్లు కేంద్ర సహాయ మంత్రి పేర్కొన్నారు.
 

గన్నవరం ఎయిర్‌పోర్డులో బయోమెట్రిక్‌ బోర్డింగు
డిజి యాత్ర ప్రాజెక్టులో భాగంగా విజయవాడ (గన్నవరం) ఎయిర్‌పోర్టులో త్వరలోనే బయోమెట్రిక్‌ బోర్డింగు విధానాన్ని ప్రారంభిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్‌ తెలిపారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో బయోమెట్రిక్‌ బోర్డింగు వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించిన అన్ని పనులూ పూర్తయినట్లు వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి ప్రశ్నకు సోమవారం రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

ఎపిలో 57.47 లక్షల ఇళ్లకు కుళాయి నీరు
ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో 57.47 లక్షల ఇళ్లకు కుళాయి ద్వారా నీరు అందిస్తున్నట్లు కేంద్ర జలశక్తిశాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ ప్రాంతాల్లో 95.69 లక్షల నివాసాలు ఉన్నాయని, మార్చి 2024 కల్లా వంద శాతం ఇళ్లకు నీరు అందించే లక్ష్యంతో రాష్ట్రం ముందుకు వెళ్తోందని వైసిపి ఎంపి మోపిదేవి వెంకటరమణ, బీద మస్తానరావు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

నౌకా విన్యాసాల సమయంలో ఆంక్షలు లేవు
నౌకా విన్యాసాల సమయంలో చేపల వేట, అమ్మకంపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని కేంద్ర రక్షణశాఖ సహాయ మంత్రి అజరు భట్‌ తెలిపారు. హార్బర్‌లో చేపల అమ్మకంపై భారతీయ నౌకాదళం ఎలాంటి నిషేధం విధించలేదని వైసిపి ఎంపి మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

ఎపిలో ఆర్‌ఎల్‌సి ప్రతిపాదన లేదు
ఆంధ్రప్రదేశ్‌లో రీజినల్‌ లాంగ్వేజ్‌ సెంటర్‌ (ఆర్‌ఎల్‌సి) ప్రతిపాదన లేదని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాష్‌ సర్కార్‌ తెలిపారు. అయితే, సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియన్‌ లాంగ్వేజెస్‌ ఆధ్వర్యంలోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఫర్‌ స్టడీస్‌ ఫర్‌ క్లాసికల్‌ తెలుగు మైసూరు నుంచి నెల్లూరు బదిలీ చేసినట్లు వైసిపి ఎంపిలు పోచ బ్రహ్మానందరెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

ఎన్‌సిఎల్‌టిల్లో 30 మంది సభ్యుల ఖాళీలు
అమరావతి సహా 15 నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సిఎల్‌టి)లో 30 మంది సభ్యులు, 270 మంది అధికారులు, సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాలశాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ తెలిపారు. 31 మే 2022 నాటికి ఎన్‌సిఎల్‌టిల్లో 20,963 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని వైసిపి ఎంపిలు బివి సత్యవతి, చింతా అనూరాధ, బెల్లాన చంద్రశేఖర్‌ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.