- 1953 -2022 వరకు 30 సార్లు మూడో ప్రమాద హెచ్చరిక
- గతంలో లేని విధంగా ఈసారి గోదావరి వరద బీభత్సం
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి : ఈ ఫొటోలోని వ్యక్తి పేరు కదల వెంకటరెడ్డి. అల్లూరి జిల్లా విఆర్.పురం మండలం జీడిగుప్ప గ్రామ వాసి. గోదావరి వరద ఒక్కసారిగా ఆ గ్రామాన్ని చుట్టుముట్టడంతో గ్రామాన్ని వదిలి కొండల పైకి వెళ్లారు. తన ఇల్లు పూర్తిగా నేలమట్టమైందని, తిరిగి పునర్ నిర్మించుకునేం దుకు రూ.లక్ష వరకూ ఖర్చు అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాన్ని ఖాళీ చేస్తే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ రాదేమోనని ఇక్కడే ఉండిపోయామని తెలిపారు.

ఈయన పేరు సవుకుల చిన్న రామిరెడ్డి. కొటారు గొమ్మువాసి. తన భార్య, ఇద్దరు కుమారులు, మనవడు, మనవరాళ్లతో కలిసి జీవిస్తున్నారు. 1986కు మించి ఈసారి గోదావరికి వరద వచ్చిందన్నారు. తమ గ్రామం పోలవరం ప్రాజెక్టు 41.15 కాంటూరు పరిధిలో ఉందని ప్రభుత్వం పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించి, పునరావాసం కల్పిస్తే వెళ్లిపోతామని తెలిపారు. ప్రభుత్వం తమ గ్రామాన్ని ఉద్దేశపూర్వకంగా గోదావరిలో ముంచిందని వాపోయారు. ఈ పరిస్థితి కొటారుగొమ్ము, జీడిగుప్ప గ్రామాలకే పరిమితం కాలేదు. అల్లూరి సీతారామరాజు జిల్లా విఆర్.పురం, కూనవరం, చింతూరు మండలాల్లో గోదావరి, శబరి నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించే అనేక గ్రామాల పరిస్థితి ఇదే. గోదారికి వరదలొచ్చిన ప్రతిసారి వేల గ్రామాలు నేలమట్టమవుతున్నాయి. తాజా వరదల నేపథ్యంలో చింతూరులో నాలుగు వేలు, ఎటపాకలో 4500, విఆర్.పురంలో 28 వేలు, కూనవరంలో 26 వేల కుటుంబాలు నీట మునిగాయని అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. క్షేత్రస్థాయిలో ఈ సంఖ్య అధికంగా ఉంటోంది. కూలిపోయిన ఇళ్లు.. ఒరిగిపోయిన విద్యుత్ స్తంభాలు.. వేళ్లతో సహా పెక్కుళించుకుపోయిన వృక్షాలు.. రోడ్ల వెంబడి బురద.. వంటి దృశ్యాలే ఎక్కడికక్కడ కనిపిస్తున్నాయి.

30 సార్లు మూడో ప్రమాద హెచ్చరిక
తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 1465 కిలోమీటర్ల పొడవున గోదావరి ప్రవహిస్తుంది. ఈ పరివాహక ప్రాంతంలో వందల గ్రామాలు ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నేపథ్యంలో మన రాష్ట్రంలోని గోదావరి పరివాహక ప్రాంతంలో పలు మండలాలు పూర్తిగా జల సమాధి అవుతున్నాయి. 1953 నుంచి ఇప్పటి వరకు గోదావరికి 30 సార్లు మూడో ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహించింది. గోదావరి నది చరిత్రలో రికార్డు చేసిన వివరాల ప్రకారం 1953లో తొలిసారి 72.5 అడుగుల స్థాయిలో వరదలు రావడంతో నది ఒడ్డున ఉండే గ్రామాలు కొట్టుకుపోయాయి. 1986లో 75.6 అడుగుల వరద రావడంతో ఊళ్లకు ఊళ్లు కొట్టుకుపోయాయి. 1990లో 70.8 అడుగులు రావడంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఖమ్మం జిల్లాలో పినపాక, మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు, కుక్కునూరు, వేలేరుపాడు, వాజేడు, వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, చింతూరు మండలాల్లో వరద బీభత్సానికి పెద్ద సంఖ్యలో గోదావరి పరివాహక లోతట్టు గ్రామాలు పూర్తిగా ముంపునకు గురయ్యాయి. ఇటీవల వచ్చిన వరదలూ వేలాది మందిని ముంచేశాయి.










