ప్రజాశక్తి కలికిరి (అన్నమయ్యజిల్లా) : యోగివేమన (వేమారెడ్డి) 610వ జయంతి వేడుకలను రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గురువారం కలికిరి క్రాస్ రోడ్ బీడీ కాలనీ సమీపంలో గల ధరణి హౌటల్ వద్ద రెడ్డి జేయేసి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పులి సత్యనారాయణ రెడ్డి, గౌరవాధ్యక్షులు వై.ఆదినారాయణ రెడ్డిల ఆధ్వర్యంలో వేమారెడ్డి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరు శతాబ్దాల క్రితమే వేమారెడ్డి తన కవితలు పద్యాలతో ప్రజలను చైతన్య పరిచారన్నారు. ప్రతి ఒక్కరు ఆయన అడుగుజాడల్లో నడిచి సహచర ప్రజలందరికీ మన సహాయ సహకారాలు అందించి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమానికి హాజరైన రెడ్డి సోదరులు వేమారెడ్డి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు సహదేవరెడ్డి, భాస్కర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, వెంకట నారాయణ రెడ్డి, మోహన రెడ్డి, పురుషోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.










