Oct 09,2023 20:16
  • బహుముఖ పోరాటాల ద్వారా భారాలు, మతోన్మాదానికి అడ్డుకట్ట

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ప్రజలను దోచుకునే సాధనంగా పట్టణ సంస్కరణలు ఉన్నాయని, సంక్షోభం నుండి బయటపడేందుకు పాలకులు వాటిని వినియోగించుకుంటున్నారని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. వడ్డేశ్వరంలో సుందరయ్య స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లో రెండు రోజుల పట్టణ ప్రాంత కార్యకర్తల వర్కుషాపును సోమవారం రాఘవులు ప్రారంభించారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా సిపిఎం నాయకులు, మాజీ డిప్యూటీ మేయర్‌ మాదల వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడారు. సంస్కరణ ప్రభావంతో ఏర్పడుతున్న సంక్షోభం నుండి బయటపడేందుకు పట్టణీకరణను ఒక సాధనంగా వాడుతున్నారని అన్నారు. పట్టణాల అభివృద్ధికి ఇవే అవరోధంగా మారుతున్నాయని, ప్రజలపై భారాలు పెరుగుతున్నాయని అన్నారు. పౌర సదుపాయాలనూ వ్యాపారంగా మార్చేస్తున్నారని తెలిపారు. అలాగే పేదలు నివసించే కాలనీలు, ధనికులు నివశించే కాలనీల మధ్య అసమానతలు విపరీతంగా పెరుగుతున్నాయని అన్నారు. ఒకవైపు ఉత్పత్తిలోనూ దోపిడీ చేస్తూ, నివాస ప్రాంతాల్లోనూ దోపిడీ చేస్తూ ప్రజలను పీక్కుతింటున్నారని ఆగ్రహించారు. ఒకవైపు భారాలతో ప్రజలు అల్లాడుతుంటే మరోవైపు మతోన్మాద శక్తులు కూడా తమ కార్యకలపాలకు పట్టణాలను కేంద్రంగా మార్చుకుని విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని పేర్కొన్నారు. సరళీకరణ, మతోన్మాదాలను ఎదుర్కోవడానికి పట్టణాలు కేంద్రంగా ఉద్యమాలు, పోరాటాలు పెంచాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం సంస్కరణలను అమలు చేస్తూ గుడ్డిగా అదేబాటలో పయనిస్తూ ప్రజలను ఇబ్బందులు పాల్జేస్తోందని తెలిపారు. దేశంలో, రాష్ట్రంలో మురికివాడలను రూపుమాపుతామని చెబుతున్న ప్రభుత్వాలు ఆధునిక మురికివాడలను నెలకొల్పుతున్నాయని విమర్శించారు. ఈ నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో ఉండే సిపిఎం కార్యకర్తలు సంస్కరణలు, ప్రజలపై భారాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేయాలని, బహుముఖ కృషి ద్వారా పాలకవర్గాలు, మతోన్మాదులను ఎదుర్కొనేందుకు ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తొలుత వక్తలను పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు వేదిక మీదకు ఆహ్వానించారు. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ బాబూరావు, విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్లో సిపిఎం ఫ్లోర్‌లీడర్‌ గంగారావు తదితరులు పాల్గొన్నారు.