Sep 12,2023 10:51

అమరావతి : ఎపి మాజీ సిఎం, టిడిపి అధినేత చంద్రబాబునాయుడిని స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో సిఐడి పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సరైన సాక్ష్యాధారాలు లేకుండా చంద్రబాబుని అరెస్టు చేయడాన్ని సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి రాఘవులు ఖండించారు. ఈ స్కామ్‌పై ఎపి సిఎం జగన్మోహన్‌రెడ్డి వ్యవహరించిన తీరుని రాఘవులు విమర్శించారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సరైన సాక్ష్యాధారాలు దొరికతే చంద్రబాబునైనా, సిఎం జగన్మోహన్‌రెడ్డినైనా ఎవరినైనా సరే తప్పకుండా అరెస్టు చేయాల్సిందే. చంద్రబాబుని అరెస్టు చేసిన తీరు ఏమాత్రం బాగోలేదు. అర్థరాత్రి వేలాదిమంది పోలీసులు మోహరించి, ఎఫ్‌ఐఆర్‌లో పేరు కూడా లేకుండా అరెస్టు చేసిన తీరు అభ్యంతరకరంగా ఉంది. ఎఫ్‌ఐఆర్‌లో పేరు నమోదు చేసి, సాక్ష్యాధారాలతో సహా ప్రజల ముందుంచి ఆయన్ని అరెస్టు చేయవచ్చు. కానీ అటువంటి పద్ధతిలో సిఎం జగన్మోహన్‌రెడ్డి వ్యవహరించలేదు. దీని వెనుక కక్ష పూరితమైన ధోరణి ఉన్నట్టుగా కనబడుతుంది తప్ప ఒక నిజాయితీగా విచారణ జరుపుదామనే ధోరణి కనబడడం లేదు. ఈ కేసు ఐదు సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంది. ఈరోజు అకస్మాత్తుగా ఎన్నికలకు ముందు ఇలాంటి చర్యలకు పాల్పడడం నిజాయితీని నిరూపించాలనే తపన కన్నా... రాజకీయంగా లబ్ధిపొందాలనే తపనే దీని వెనుక ఉన్నట్టుగా కనిపిస్తుంది.' అని ఆయన అన్నారు.