Oct 07,2023 22:25
  • రాష్ట్రంలో యథేచ్ఛగా ఆస్తుల లూటీ, నిధుల దోపిడీ
  • రాష్ట్ర సమగ్రాభివృద్ధి-ప్రత్యామ్నాయ విధానాలు సెమినార్‌ ప్రారంభం

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : పేదలకు న్యాయం జరగాలంటే అసమానతలు లేని అభివృద్ధి కావాలని, రాష్ట్రంలో కొద్దికాలంగా పాలన పేరుతో ఆస్తుల లూటీ, నిధుల దోపిడీ యథేచ్ఛగా సాగుతోందని, ప్రజాశ్రేయస్సు, సమాజాభివృద్ధి అనేది కనిపించడం లేదని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ సమగ్రాభివృద్ధి, ప్రత్యామ్నాయ విధానాలు అనే అంశంపై సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యాన విజయవాడలోని ఎంబివికెలో రెండు రోజులపాటు జరుగుతున్న సెమినార్‌ను శనివారం రాఘవులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నయా ఉదారవాద విధానాల అమలు వేగమవుతున్న కొద్దీ పాలనలో ప్రజల సంక్షేమం బాగోగులు అనే విషయాలు పక్కకు పోతున్నాయని తెలిపారు. రాష్ట్రం విడిపోయిన తరువాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు చేసిందేమీ లేదని అన్నారు. గతంలో చంద్రబాబు గానీ, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గానీ ప్రజలకు ఎంతో చేశామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తే సంక్షేమం జాడ కనిపించడం లేదని విమర్శించారు. అనేక నినాదాలు, పిలుపులు, పథకాలు ఎన్ని ఇచ్చినా ఫలాలు పేదలకు చేరడం లేదని పేర్కొన్నారు. జిఎస్‌డిపి పెరిగిందని చెబుతున్న లెక్కలేవీ రాష్ట్ర నికర అభివృద్ధికి తోడ్పడటం లేదని, లెక్కలకు మాత్రమే పరిమితం అవుతున్నాయని అన్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో జిఎస్‌డిపి 9.3 శాతం ఉందని చెప్పినా, ప్రస్తుతం 7.3 శాతం ఉందని చెప్పినా అవన్నీ ఒకటీరెండు రంగాలకే పరిమితం అయ్యాయని అన్నారు. అప్పట్లో చేపల ఎగుమతి, ప్రస్తుతం ఇసుక, మైనింగు రూపంలో అభివృద్ధి ఉందని అన్నారు. అభివృద్ధిలో కీలకమైన వ్యవసాయం, పరిశ్రమలు, సేవల రంగాల్లో మెరుగుదల లేదని తెలిపారు. పక్క రాష్ట్రాలకు ప్రత్యక్ష విదేశీ నిల్వలు బిలియన్లలో వస్తుంటే రాష్ట్రానికి మిలియన్లలో మాత్రమే వస్తున్నాయన్నారు. 2021లో దేశంలోకి 7,400 కోట్ల డాలర్లు పెట్టుబడులు వస్తే మన రాష్ట్రానికి అందులో 8.5 కోట్ల డాలర్లు మాత్రమే వచ్చాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఈ నేపథ్యంలో సామాన్యులు, ప్రజలకు జీవనోపాధి కల్పించే విధంగా అభివృద్ధి ఉండాలని, దీనికోసం సిపిఎం కృషి చేస్తోందని అన్నారు.

vsr

ప్రారంభ సభకు అధ్యక్షత వహించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధి ముఖ్యమా సంక్షేమం ముఖ్యమా అనే చర్చ నడుస్తోందని, అభివృద్ధి అనేది సమగ్ర దృక్పథంతో సాగాలని, సంక్షేమం అందులో భాగమని అన్నారు. రాష్ట్రంలో నాలుగేళ్లలో ఒక్కపరిశ్రమ కూడా రాలేదని, ఇటీవల జరిగిన పెట్టుబడుల సమ్మిట్లో రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెబుతున్నారని, అవన్నీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉన్నాయని అన్నారు. భూములు తీసుకుని పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చెబుతున్నారని, ఆచరణలో వాటిని బ్యాంకుల్లో కుదువపెట్టి కోట్ల రూపాయలు రుణాలు తీసుకుని ఎగ్గొడుతున్నారని ఆగ్రహించారు. మరోవైపు సాగు విస్తీర్ణమూ తగ్గుతోందని, అటు పరిశ్రమలు రాక, ఇటు వ్యవసాయమూ లేక రాష్ట్రం దెబ్బతినిపోతోందని పేర్కొన్నారు. రైతు భరోసా నిధులు దేనికీ సరిపోవడం లేదని, చివరకు అప్పుల పాలైన రైతులు ఆత్మహత్య చేసుకునేందుకు అవసరమైన పురుగు మందు కొనుగోలుకు మాత్రం సరిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతి మూడు రోజులకు ఒక కౌలు రైతు ఆత్మహత్య చేసుకుంటున్నారని అన్నారు. రైతులను ఆదుకోవాల్సిన కేంద్రం కౌలు రైతులను గుర్తించడం లేదని, ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం అంటే ప్రధానంగా కౌలు రైతులేనని అన్నారు. ఈ నేపథ్యంలో ఒక సమగ్ర ప్రాతిపదికన అభివృద్ధి జరగాలని, దీనికోసం సిపిఎంగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా విశ్రాంత ప్రొఫెసర్‌ ఎన్‌ వేణుగోపాలరావు రచించిన దేశ స్వావలంబనకు కీలకం రైతు వ్యవసాయం అనే పుస్తకాన్ని రాఘవులు ఆవిష్కరించారు. ఈ సభలో యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ ప్రొఫెసర్‌ పురేంద్రప్రసాద్‌, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎం.ఏ.గఫూర్‌, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణయ్య, ప్రభాకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు వక్తలను వేదిక మీదకు ఆహ్వానించి సదస్సును సమన్వయం చేశారు. ఎనిమిది అంశాలపై వేర్వేరు రంగాలకు చెందిన నిపుణులు ఈ రెండు రోజుల సెమినార్లో పాల్గొంటున్నారు.

book

 

seminor