- గోప్యంగా ఉంచిన ఉపాధ్యాయులు
ప్రజాశక్తి- యు.కొత్తపల్లి (కాకినాడ) : కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ కొత్తపల్లి ఉన్నత పాఠశాలలో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. సొమ్మసిల్లి పడిపోయారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఐదు రోజులుగా రోజుకు ఒకరిద్దరు విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్టు తోటి విద్యార్థినులు తెలిపారు. ఉపాధ్యాయులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఉదయం పాఠశాలకు వచ్చిన 9, 10 తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్థినులు ఊపిరి అందక అస్వస్థత గురయ్యారు. ఆయా విద్యార్థినుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని కాకినాడలో ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేర్చడంతో విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. అస్వస్థతకు కారణం ఏమిటనేది వైద్యులు కూడా చెప్పలేకపోయారని విద్యార్థినుల తల్లిదండ్రులు తెలిపారు. విషయం బయటకు రావడంతో ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ విద్యార్థులందరినీ పాఠశాలకు రప్పించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అదే సమయంలో మరో ఇద్దరు విద్యార్థినులు అస్వస్థతకు గురికావడంతో వారిని హుటాహుటిన కొత్తపల్లి పిహెచ్‌సికి తరలించారు.
పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆసుపత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న విద్యార్థినులను పరామర్శించారు. విద్యార్థులందరికీ పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని వైద్యులకు సూచించారు. విషయాన్ని జెసి, డిఎంహెచ్‌ఒ, డిఇఒ దృష్టికి తీసుకెళ్లామని, వారు పూర్తిస్థాయిలో సమాచారాన్ని సేకరిస్తున్నారని తెలిపారు. అస్వస్థతకు గురైన విద్యార్థినులకు కాకినాడలో మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. అస్వస్థతకు కారణాలు తెలియలేదని, ఇద్దరు విద్యార్థులకు మాత్రం హిమోగ్లోబిన్ తక్కువగా ఉండటం వల్ల అస్వస్థతకు గురైనట్లు వైద్యులు తెలిపారని ఎమ్మెల్యే చెప్పారు.










