- పలు జిల్లాల్లో తడిచిన ధాన్యం, మిర్చి, మొక్కజొన్న
- కన్నీటి పర్యంతమవుతున్న రైతులు
ప్రజాశక్తి- యంత్రాంగం : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం కురిసిన అకాల వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. కళ్లాల్లో ఉంచిన ధాన్యం, మిరప, మొక్కజొన్న తడిచిపోవడంతో రైతులు కన్నీటిపర్యంతం అయ్యారు. ఈదురు గాలుల వల్ల మామిడి, అరటి తోటలకు నష్టం వాటిల్లింది. కళ్లాల్లో ఆరబెట్టిన, అమ్మకానికి సిద్ధం ఉంచిన పంటలను కాపాడుకోవడానికి రైతులు తీవ్ర అవస్థలు పడాల్సి వచ్చింది. వర్షంతో పాటు పిడుగులు కూడా పడడంతో ఇద్దరు మృతి చెందారు. 44 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. పల్నాడు జిల్లా క్రోసూరు, అచ్చంపేట, అమరావతి, పెదకూరపాడు మండలాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులు వీచాయి. వర్షాలకు వరి, మిర్చి, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లింది. పల్నాడు జిల్లాలో ఈదురుగాలులు వీచాయి. గుంటూరు జిల్లాలో జల్లులు పడ్డాయి. ప్రకాశం జిల్లా పొదిలి, కొనకనమిట్ల మండలాల్లో భారీ వర్షం, ఈదురు గాలులకు పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బాపట్ల జిల్లా నిజాంపట్నంలో వర్షం కురవడంతో టార్పాలిన్లు కప్పి కళ్లాలోని వేరుశనగ, మొక్కజొన్నను కాపాడుకొనే ప్రయత్నం రైతులు చేశారు. పంగులూరులో శనివారం కురిసిన వర్షానికి మొక్కజొన్న రైతులు కొంత వాటిల్లిగా, ఆదివారం కూడా మేఘావృతం కావడంతో రైతులు ఆందోళన చెందారు. ఎన్‌టిఆర్ జిల్లా విజయవాడలో భారీ వర్షం కురిసింది. వన్‌టౌన్, పటమట, సత్యనారాయణ పురం, గవర్నరుపేట ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు ప్రవహించింది. నందిగామ, కంచికచర్ల, వీరులపాడు మండలాల్లో స్పల్పంగా వర్షం కురిసింది. కృష్ణా జిల్లా గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు, గుడివాడ, నందివాడ, పెనమలూరు, కంకిపాడు మండలాల్లో భారీ వర్షం పడింది. ధాన్యం రాశులు తడిచిపోయాయి. ఏలూరు జిల్లా ముదినేపల్లి, నూజివీడు, చింతలపూడి తదితర ప్రాంతాల్లో ఈదురుగాలుతో భారీ వర్షం కురవడంతో మామిడి, అరటి, మొక్కజొన్న తదితర పంటలకు నష్టం వాటిల్లింది. కళ్లాల్లో ఉంచిన మొక్కజొన్నను కాపాడుకునేందుకు రైతులు పరుగులు తీశారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఆకాశం మేఘావృతమైంది. అక్కడకక్కడా చిరుజల్లులు పడ్డాయి.
పల్నాడు జిల్లాలో పిడుగుపాటుకు రేషన్ సరఫరాదారుడు మృతి
పల్నాడు జిల్లా క్రోసూరు మండలం బయ్యవరం గ్రామానికి చెందిన రేషన్ సరఫరాదారుడు కడియం వెంకట్రావు (38) పిడుగుపాటుతో మృతి చెందారు గ్రామంలోని మర్రిచెట్టుపై పడిగుపడింది. ఈ చెట్టుకింద ఉన్న నలుగురు స్పృహతప్పి పడిపోయారు. వెంకట్రావు వీపు భాగంలో పిడుగుపడడంతో అక్కడికక్కడే మృతి చెరదారు. ఆయనకు భార్య మాధవి, ఇద్దరు పిల్లలు గోపి నారాయణ ఉన్నారు.
కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో 34 గొర్రెలు మృత్యువాత
పిడుగుపాటుకు కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో 44 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. కర్నూలు జిల్లా చిప్పగిరిమండలం నగరడోన పంచాయతీలోని తిమ్మాపురం గ్రామ సమీపంలో పిడుగుపడింది. 34 గొర్రెలు మృతి చెందాయి. వీటిలో కొత్తపేట భీమన్నకు చెందిన 15 గొర్రెలు, తిమ్మాపురానికి చెందిన సీను, జయరాముడు, హుస్సేన్ సాహెబ్, సురేష్ చెందిన 15 గొర్రెలు ఉన్నాయి. ప్రకాశం జిల్లా ఇరకలగుండంలో పిడుగుపాటుకు పది గొర్రెలు మృతి చెందాయి.










