Sep 21,2023 21:34
  •  బిజెపి పాలనలో దళితులకు రక్షణ కరువు
  •  దళితరక్షణ యాత్ర ప్రారంభ సభలో కెవిపిఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి

ప్రజాశక్తి - భీమవరం (పశ్చిమగోదావరి జిల్లా) : రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని కెవిపిఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి కోరారు. బిజెపి పాలనలో దళితులకు రక్షణ కరువైందని, దళితులు, దళిత సంఘాల నేతలు ఒకే తాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అసైన్డ్‌ భూముల చట్ట సవరణను తక్షణమే విరమించుకోవాలని, లేనిపక్షంలో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కెవిపిఎస్‌, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా చేపట్టిన దళిత రక్షణ యాత్రను భీమవరంలో మాల్యాద్రి గురువారం ప్రారంభించారు. తొలుత అంబేద్కర్‌ విగ్రహానికి మాల్యాద్రి, కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి కె.క్రాంతిబాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాల్యాద్రి మాట్లాడుతూ మోడీ అధికారంలోకి వచ్చాక ఆర్‌ఎస్‌ఎస్‌ మనువాద సిద్ధాంతాన్ని శరవేగంగా అమలు చేస్తున్నారని తెలిపారు. రాజ్యాంగాన్ని రద్దుచేసి మనస్కతిని అమలు చేయాలని ప్రయత్నిస్తున్నారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా అమ్మేయడమే కాకుండా దేశ సంపదను అంబానీ, అదానీలకు దోచిపెడుతున్నారని తెలిపారు. దళితులకు ఉన్న రాజ్యాంగ హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని అన్నారు. కార్యక్రమంలో దళిత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు గంటా సుందర్‌కుమార్‌, సిఐటియు, పట్టణ పౌర సమాఖ్య, ఎస్‌ఎఫ్‌ఐ, ప్రజానాట్య మండలి నాయకులు యాత్రకు సంఘీభావం తెలిపారు.