Feb 25,2023 10:01
  • కెప్టెన్స్‌ రనౌట్స్‌తో ఫలితం తారుమారు

(ప్రజాశక్తి స్పోర్డ్స్‌ డెస్క్‌) : ఐసిసి ప్రపంచకప్‌ టోర్నీల్లో భారతజట్టు సెమీఫైనల్లో ఓడిన సందర్భాలు ఎన్నో ఉన్నా.. విజయానికి చేరువగా వచ్చి.. కెప్టెన్‌ రనౌట్‌ కావడం ద్వారా ఓడిన సందర్భాలు ఏవైనా ఉన్నాయా అని పరిశీలిస్తే.. ముందుగా గుర్తుకు వచ్చేది 2019లో మహేంద్రసింగ్‌ ధోనీ రనౌట్‌. ఆ తర్వాత ఆస్ట్రేలియా మహిళలతో గురువారం జరిగిన టి20 ప్రపంచకప్‌ సెమీస్‌లో భారత మహిళలజట్టు ఓటమి. టి20 మహిళల ప్రపంచకప్‌ సెమీఫైనల్లో భాగంగా ఆస్ట్రేలియాతో నిర్దేశించిన 173పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారతజట్టు 167 పరుగులు చేసి ఐదు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. టీమిండియా విజయానికి 32బంతుల్లో 40పరుగులు చేయాల్సిన దశలో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ రనౌట్‌గా ఔట్‌ కావడం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇదే విషయాన్ని మాజీ క్రికెటర్లు సోషల్‌ మీడియా వేదికగా తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు. అలాగే 2019 ఐసిసి వన్డే ప్రపంచకప్‌ సెమీఫైనల్లోనూ అప్పటి కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ రనౌట్‌ కావడం కూడా జట్టు ఫలితాన్ని తారుమారు చేసింది. 2019 వన్డే ప్రపంచకప్‌ సెమీస్‌లో న్యూజిలాండ్‌ నిర్దేశించిన 240పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 49వ ఓవర్‌లో ధోనీ రనౌట్‌ అయ్యాడు. దీంతో అప్పటివరకు విజయావకాశాలు భారత్‌ పక్షాన ఉన్నా.. ధోనీ రనౌట్‌తో మ్యాచ్‌ ఫలితం మారిపోయింది. ఈ రెండు సందర్భాల్లోనూ కెప్టెన్లు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో సెమీస్‌లో ఓటమి అనంతరం హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ భావోద్వేగానికి గురైన ఫొటోలు హల్‌చల్‌ చేస్తున్నాయి.