- విశాఖలో ప్రారంభించనున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
ప్రజాశక్తి - కలెక్టరేట్ (విశాఖపట్నం) : స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కోసం సిపిఎం తలపెట్టిన ఉక్కు రక్షణ బైకు యాత్ర బుధవారం ప్రారంభం కానుంది. ఈ యాత్ర ఉత్తరాంధ్ర అంతటా సాగి ఈ నెల 29న ఉక్కు నగరంలో ముగియనుంది. విశాఖపట్నంలోని జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాలు నిర్వహిస్తున్న ఉక్కు దీక్షా శిబిరం నుంచి ఈ బైకు యాత్రను బుధవారం ఉదయం 10.30 గంటలకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రారంభించనున్నారు. వామపక్ష పార్టీల నాయకులు, కార్మిక, ప్రజా సంఘాల నాయకులు, మేథావులు, ప్రముఖులు, కవులు, కళాకారులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ యాత్ర తొలిరోజు మద్దిలపాలెం వెళ్లి అనంతరం ఆరిలోవ, మధురవాడ, తగరపువలస మీదుగా రాత్రికి విజయనగరం చేరుకుంటుంది. 21న నెల్లిమర్ల, చీపురుపల్లి, రాజాం, ఎచ్చెర్ల, ఆముదాలవలస, శ్రీకాకుళంలోనూ, 22న శ్రీకాకుళం, నరసన్నపేట, టెక్కలి, పలాస, సోంపేట, మందసలోనూ, 23న ఇచ్చాపురం, పాతపట్నం, కొత్తూరు, పాలకొండలోనూ, 24న కురుపాం, పార్వతీపురం, సాలూరు, బొబ్బిలిలోనూ, 25న గజపతినగరం, ఎస్.కోట, అరకువ్యాలీ, పాడేరులోనూ, 26న చింతపల్లి, నర్సీపట్నం, పాయకరావుపేట, నక్కపల్లిలోనూ, 27న యలమంచిలి, రాంబిల్లి, అచ్యుతాపురం, పరవాడ, అనకాపల్లిలోనూ, 28న బుచ్చయ్యపేట, వి.మాడుగుల, చోడవరం, సబ్బవరం, స్టీల్‌ప్లాంట్ టౌన్‌షిప్‌లోనూ, 29న ఉక్కు మృతవీరుల స్తూపం, అగనంపూడి, వడ్లపూడి, స్టీల్‌ప్లాంట్ ఏరియాలోనూ సాగనుంది. చివరి రోజు సాయంత్రం 4 గంటలకు ఉక్కు నగరంలోని త్రిష్ణా గ్రౌండ్‌లో ముగింపు సభ జరగనుంది. సిపిఎం జాతీయ నాయకులు, రాష్ట్రంలోని ప్రముఖులు ఈ సభలో మాట్లాడనున్నారు. బైకు యాత్రకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం నాయకత్వం వహిస్తారు. ఆరు జిల్లాల్లో పర్యటించే ఈ యాత్ర సుమారు 1200 కిలోమీటర్లు సాగనుంది. కేంద్ర ప్రభుత్వం ఉక్కు కర్మాగారంపై అనుసరిస్తోన్న వైఖరిని వాడవాడలా ఈ బైకు యాత్ర ద్వారా నాయకులు తెలియజేయనున్నారు.
పోస్టర్ల ఆవిష్కరణ
ఉక్కు రక్షణ బైకుయాత్రను, సభను జయప్రదం చేయాలంటూ మంగళవారం విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో పలుచోట్ల పోస్టర్లను సిపిఎం, ప్రజా సంఘాల నాయకులు ఆవిష్కరించారు. జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల జెఎసి ఆధ్వర్యాన జరుగుతున్న ఉక్కు దీక్షలు మంగళవారానికి 899వ రోజుకు, కూర్మన్నపాలెం కూడలి వద్ద విశాఖ ఉక్కు పరరిక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన జరుగుతున్న రిలే దీక్షలు 950వ రోజుకు చేరుకున్నాయి. ఆయా కార్యక్రమాల్లో వక్తలు మాట్లాడుతూ ఉక్కు రక్షణ బైకు యాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.










