- యుటిఎఫ్ స్వర్ణోత్సవ జాతాలో నాయకులు
ప్రజాశక్తి - కాకినాడ ప్రతినిధి, నెల్లూరు : విద్యారంగ పరిరక్షణలో యుటిఎఫ్ కీలకపాత్ర పోషించిందని మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం, యుటిఎఫ్ నాయకులు అన్నారు. హిందూపురంలో ప్రారంభమైన యుటిఎఫ్ స్వర్ణోత్సవ సంబరాల ప్రచార జాత సోమవారం నెల్లూరులో, శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ప్రారంభమైన జాతా తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాలో సాగింది. కడియం, సామర్లకోట, పెద్దాపురంలో యాత్ర సాగింది. నెల్లూరులో యుటిఎఫ్ జెండాను మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయ సంఘం 50 ఏళ్ల ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసి భవిష్యత్తు వైపునకు ఉరకలు వేస్తు ప్రయాణిస్తున్న సమయం ఇది అన్నారు. అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ట్రేడ్ యూనియన్ల పట్ల సదాభిప్రాయం లేకుండా దుర్మార్గమైన పాలనను కొనసాగిస్తున్నాయని విమర్శించారు. యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఉపాధ్యాయ సమస్యలు, విద్యారంగ అభివృద్ధికి యుటిఎఫ్ చేస్తున్న కృషిని వివరించారు. అనంతరం మినీబైపాస్ రోడ్డులో పూలే దంపతుల విగ్రహలకు నివాళులర్పించారు. సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవంలో 200 బైకులతో ర్యాలీ నిర్వహించారు. పలుచోట్ల యుటిఎఫ్ సీనియర్ నాయకులు ప్రభాకరవర్మ, జోగా అప్పారావు తదితరులు యుటిఎఫ్ పతాకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్‌ఎస్.ప్రసాద్ మాట్లాడారు. రాష్ట్రంలో ఉపాధ్యాయలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పనిచేసే సంఘంగా యుటిఎఫ్ నిలిచిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పోరాటాలను మరింత ఉధృతంగా కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు.










