Aug 05,2023 10:25

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : మణిపూర్‌ పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేయాలని పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు తమ ఆందోళనను శుక్రవారం కూడా కొనసాగించాయి. దీంతో ఉభయ సభలు వాయిదాల పర్వం తొక్కాయి. తొలుత రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. మణిపూర్‌పై రూల్‌ 267 కింద చర్చ జరగాలని ప్రతిపక్షాలు పట్టుపట్టగా, రాజస్థాన్‌లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై రూల్‌ 176 కింద చర్చ జరగాలని కేంద్ర మంత్రి, సభా నాయకుడు పియూష్‌ గోయల్‌ డిమాండ్‌ చేశారు, దీనికి ట్రెజరీ బెంచ్‌లోని ఎంపిలు మద్దతు ఇచ్చారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. వెంటనే సభను సోమవారానికి వాయిదా వేశారు. మరోవైపు లోక్‌సభ సమావేశం ప్రారంభం నుంచే ప్రతిపక్ష ఎంపిలు ప్లకార్డులు చేబూని నినాదాలు చేశారు. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలో అనుసంధన్‌ నేషనల్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ బిల్లు ప్రవేశపెట్టారు. అనంతరం ఇంటర్‌-సర్వీసెస్‌ ఆర్గనైజేషన్స్‌ (కమాండ్‌, కంట్రోల్‌ అండ్‌ డిసిప్లిన్‌) బిల్లు, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (సవరణ) బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించుకున్నారు. వెంటనే సభ మధ్యాహ్నం 12ః50 గంటలకు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన సభలో ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లులను ప్రవేశపెట్టారు. ప్రత్యేక హోదాను జత చేస్తూ రాష్ట్ర పునర్విభజన సవరణ ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లును వైసిపి ఎంపి మార్గాని భరత్‌ ప్రవేశపెట్టారు. హైదరాబాద్‌లో సుప్రీం కోర్టు పర్మినెంట్‌ బెంచ్‌ను ఏర్పాటు (అంచనాల అమలు), క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ సవరణ ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లులను టిడిపి ఎంపి కేశినేని నాని ప్రవేశపెట్టారు. బిజెపి తన లోక్‌సభ ఎంపిలకు 3 లైన్ల విప్‌ జారీ చేసింది. ఆగస్ట్‌ 7 నుంచి 11 వరకు హాజరు కావాలని కోరింది. ప్రభుత్వ స్టాండ్‌, బిల్లులకు మద్దతు ఇవ్వాలని కోరారు.
 

                                                                            బిఆర్‌ఎస్‌ ధర్నా

మణిపూర్‌ సమస్య, ఢిల్లీ సర్వీసుల బిల్లుపై బిఆర్‌ఎస్‌ ఎంపిలు ధర్నా చేపట్టారు. పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు పట్టుకొని నినాదాలు ఇచ్చారు. లోక్‌సభలో మూజువాణి ఓటుతో ఆమోదించిన నేషనల్‌ క్యాపిటల్‌ టెరిటరీ ఆఫ్‌ ఢిల్లీ (సవరణ) బిల్లుని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. మణిపూర్‌పై చర్చ జరగాలని డిమాండ్‌ చేశారు.
 

                                                                                ఆప్‌ ఎంపి సస్పెండ్‌

లోక్‌సభలో ఆప్‌ ఎంపి సుశీల్‌ కుమార్‌ రింకూను సస్పెండ్‌ చేశారు. కొత్తగా ఎన్నికైన ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపి సుశీల్‌ కుమార్‌ రింకూను లోక్‌సభ వర్షాకాల సమావేశాల మిగిలిన రోజులకు సస్పెండ్‌ చేశారు. ఇప్పటికే ఆప్‌ రాజ్యసభ ఎంపి సంజరు సింగ్‌ సస్పెండ్‌కు గురయ్యారు.