ట్విటర్‌లో నగదు కొరత తీవ్రంగా ఉందని దాని యజమాని ఎలాన్ మస్క్ ఆదివారం పేర్కొన్నారు. ముఖ్యంగా వాణిజ్య ప్రకటనల ఆదాయం సగానికి పడిపోవడం, భారీగా రుణాలు ఉండటంతో ఈ పరిస్థితి తలెత్తిందని వివరించారు. '' వాణిజ్య ప్రకటనల ఆదాయంలో 50శాతం తగ్గుదల కారణంగా మేము ఇంకా నగదు లోటులోనే కొనసాగుతున్నాం.దీనికి తోడు రుణభారం చాలా ఎక్కువగా ఉంది. లోటు నుంచి మిగులు దశకు చేరడం చాలా ముఖ్యం'' అని పేర్కొన్నారు. వాస్తవానికి ఈ ఏడాది 4.5 బిలియన్ డాలర్ల ఆదాయం వస్తుందని అంచనావేశారు. కానీ, తర్వాత ఆ అంచనాలను కూడా 3 బిలియన్ డాలర్లకు కుదించారు. 2021లో 5.1 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ.మస్క్ ట్విటర్ ఆధీనంలోకి తీసుకొన్నప్పటి నుంచి వ్యయనియంత్రణ చర్యలు చేపట్టారు. కానీ, అవేవీ ఇప్పటి వరకు సత్ఫలితాలిస్తున్నట్లు కనిపించడంలేదు. భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించారు. మస్క్ ఆశించిన స్థాయిలో ట్విటర్ ఆదాయం పెరగలేదు.టెస్లా అధినేత ఎలాన్ మస్క్.. ట్విటర్‌ను ప్రయోగశాలగా మార్చేశారు. రోజుకో రూల్ తీసుకొస్తూ యూజర్ల సహనానికి పరీక్ష పెడుతున్నారు. ఇప్పటికే బ్లూ టిక్, సబ్ స్క్రిప్షన్ పేరిట నిబంధనలు పెట్టిన మస్క్.. ఎక్కువ మంది వెరిఫై అకౌంట్లు తీసుకునేలా సరికొత్త ప్లాన్ వేశాడు. పోస్టులను చూసేందుకు లిమిట్ సెట్ చేశాడు. ఒక రోజులో ఎవరు ఎన్ని పోస్టులను చదవవచ్చనే దానిపై తాత్కాలిక పరిమితులను అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ చర్యలతో వినియోగదారులు కూడా కొంత అసంతఅప్తికి గురయ్యారు.










