Sep 16,2023 20:52
  •  6న రాజ్‌ భవన్‌ ముట్టడి : ఆర్‌ లక్ష్మయ్య
  • ఎఐఆర్‌టిడబ్ల్యుఎఫ్‌ రాష్ట్ర వర్క్‌షాప్‌ ప్రారంభం
  • కర్నూలులో ర్యాలీ, బహిరంగ సభ

ప్రజాశక్తి- కర్నూలు ప్రతినిధి : మోడీ ప్రభుత్వ విధానాలతో రవాణా రంగం మరింత సంక్షోభంలోకి నెట్టబడిందని ఆల్‌ ఇండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఎఐఆర్‌టిడబ్ల్యుఎఫ్‌) జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్‌.లక్ష్మయ్య అన్నారు. ఎఐఆర్‌టిడబ్ల్యుఎఫ్‌ రాష్ట్ర వర్క్‌షాప్‌ ప్రారంభం సందర్భంగా శనివారం కర్నూలులో ఆటో, ఇతర వాహనాలతో ప్రదర్శన, అనంతరం సభ నిర్వహించారు. ఈ సభలో లక్ష్మయ్య మాట్లాడుతూ రవాణా రంగాన్ని కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించేందుకు మోటార్‌ వాహన చట్టానికి కేంద్ర ప్రభుత్వం సవరణలు తీసుకొచ్చిందన్నారు. ఉబర్‌, ఓలా వంటి యాప్‌లు డ్రైవర్ల పొట్ట కొడుతున్నాయని తెలిపారు. కేరళలో సవారి పేరుతో ప్రత్యామ్నాయ యాప్‌ తీసుకొచ్చారని, అలాంటి యాప్‌ కేంద్ర ప్రభుత్వం ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. తిరిగి మోటర్‌ వాహన చట్టానికి కార్మికులకు అనుకూలంగా సవరణలు చేయాలని, రవాణా రంగ కార్మికులకు సామాజిక సంక్షేమ చట్టం తేవాలని అక్టోబర్‌ 6న అన్ని రాష్ట్రాల్లో 'చలో రాజ్‌భవన్‌' కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆర్‌టిసి ఎస్‌డబ్ల్యుఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అయ్యపురెడ్డి మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు గుర్తింపు కార్డులు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి.అంజిబాబు మాట్లాడుతూ రవాణా రంగం బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్‌ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు శివాజీ, ప్రధాన కార్యదర్శి ముజఫర్‌ అహ్మద్‌, ఆర్‌టిసి ఎస్‌డబ్ల్యుఎఫ్‌ అధ్యక్షులు సిహెచ్‌.సుందరయ్య, కోశాధికారి దివాకర్‌, సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్‌.రాధాకృష్ణ పాల్గొన్నారు. అనంతరం పెద్ద మార్కెట్‌ సమీపంలోని శ్రీలకీëనరసింహ కల్యాణ మండపంలో రెండు రోజుల పాటు జరగనున్న రాష్ట్ర వర్క్‌షాప్‌ను పతాకావిష్కరణ చేసి ఆర్‌.లక్ష్మయ్య ప్రారంభించి ప్రసంగించారు. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నరసింగరావు తదితరులు పాల్గొన్నారు.

2

 

4

 

3