ఇండోర్ : మధ్యప్రదేశ్‌లో శ్రీరామనవమి వేడుకలో ఆలయంలో మెట్లబావి పైకప్పు కూలిన దుర్ఘటనలో... మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 35 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు. గల్లంతైన మరో వ్యక్తి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు.
పటేల్ నగర్ ప్రాంతంలో ఉన్న ఈ పురాతన ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలకు పెద్దఎత్తున భక్తులు తరలిరావడంతో రద్దీ పెరిగింది. స్థలాభావం కారణంగా వేడుకలను చూసేందుకు కొందరు భక్తులు ఆలయ ప్రాంగణంలో ఉన్న మెట్లబావి కప్పుపై కూర్చున్నారు. దీంతో బావి పైకప్పు ఒక్కసారిగా కూలిపోయి అంతా బావిలో పడిపోయారు. సమాచారమందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగింది. ఈ ప్రమాదంలో 50 మందికి పైగా బావిలో పడిపోయారు. 16 మందిని సహాయక సిబ్బంది రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఇప్పటివరకు 35 మంది మఅతదేహాలను బావి నుంచి వెలికితీశామని ఇండోర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఇళయరాజా మీడియాకు వెల్లడించారు. ఓ వ్యక్తి గల్లంతయ్యారని, ఆ వ్యక్తి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు.
పురాతనకాలం బావి.. పైన శ్లాబుతోనే ఫ్లోరింగ్...
ఈ ఆలయం ఉన్న భూమిలో పురాతన కాలం నుంచి ఓ మెట్లబావి ఉంది. అయితే దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం ఆ బావిని మూసేశారు. కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా కేవలం పైన శ్లాబుతో ఫ్లోరింగ్ చేసి.. ఆలయాన్ని నిర్మించారు. ఆ విషయం తెలియక చాలామంది బావి ఉన్న ప్రాంతంలో కూర్చునేసరికి బరువు మోయలేక.. నేల కుంగిపోయి ఈ దుర్ఘటన చోటుచేసుకుందని స్థానిక అధికారులు వెల్లడించారు. బావి లోతు దాదాపు 50 అడుగులు ఉన్నట్లు తెలుస్తోంది.










