Sep 21,2023 21:58

ప్రజాశక్తి-ఉక్కునగరం (విశాఖ) : విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఉద్యమ స్ఫూర్తి ప్రధాత తెన్నేటి విశ్వనాథం 128వ జయంతిని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ దీక్షా శిబిరంలో గురువారం నిర్వహించారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ కూర్మన్నపాలెం కూడలిలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన చేపట్టిన దీక్షలు గురువారం నాటికి 952వ రోజుకు చేరాయి. ఈ దీక్షలో స్టీల్‌ప్లాంట్‌ ఒబిసి అసోసియేషన్‌ సభ్యులు కూర్చున్నారు. దీక్షా శిబిరంలో ముందుగా తెన్నేటి విశ్వనాధం చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా పోరాట కమిటీ నాయకులు వై.మస్తానప్ప మాట్లాడుతూ.. విశాఖలో ఉక్కు కర్మాగారం నెలకొల్పాలని 1965 జులై 1న రాష్ట్ర అసెంబ్లీలో ఆనాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన తీర్మానానికి ఎటువంటి రాజకీయ భేషజాలకు పోకుండా అన్ని ప్రతిపక్ష పార్టీలూ ఏకగ్రీవంగా ఆమోదించడంలో తేన్నేటి విశ్వనాథం ప్రధాన పాత్ర పోషించారని తెలిపారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదాన్ని రాష్ర ్టవ్యాప్తంగా ప్రచారం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించారని చెప్పారు. స్టీల్‌ప్లాంట్‌ ఒబిసి అసోసియేషన్‌ అధ్యక్షులు బి.అప్పారావు మాట్లాడుతూ విశాఖ ఉక్కు నిర్మాణంలో రాజకీయంగా తనదైన పాత్ర పోషించిన తెన్నేటిని విశాఖ ఉక్కు కార్మికులు, యావత్‌ తెలుగు ప్రజలు స్మరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బి.అప్పారావు, కారు రమణ, కామేశ్వరరావు, గెద్దాడ అప్పలరాజు, దాసరి పుల్లారావు, కోయిలాడ శ్రీనివాస్‌, ఆర్‌వి.నారాయణ, తదితరులు పాల్గొన్నారు.