Aug 15,2022 07:54

బంగారు భారతి దాస్యవిముక్తికై స్త్రీ త్యాగం అనిర్వచనీయం.
''కస్తూరి మాత జైలులోన కాలమొందిందీ, తల్లీకాలమొందిందీ,
వీర నారీలోకమునకు దారి చూపిందీ, తల్లీదారి చూపిందీ, కస్తూరి మాత''
అని చిన్పప్పుడు పాడిన పాటలు గుర్తు కొస్తుంటే, గుండెలు ద్రవిస్తుంటాయి.
సృష్టిలో ప్రతి జీవికి ప్రాణం కన్నా తీపి అయినది ఏదీ లేదు. మనం బయటకు వెళితే, రోడ్లు ప్రక్క రైల్వే ప్లాట్‌ఫారాలపై పూర్తి వికలాంగులు, అంధులు, కుష్టువ్యాధిగ్రస్తులు అడుక్కుతింటూ, ఏ చిన్న సౌకర్యం లేని, నికృష్ణ జీవితం గడుపుతూ బ్రతుకు పోరాటం చేస్తున్నారు? అంటే ఎంతటి నరకంలోనైనా, ప్రాణం నిలబెట్టుకోడానికే ప్రతిజీవి, పంచభూతాలతో పోరాడుతోంది. అంతటి గొప్ప ప్రాణాల్ని, తృణప్రాయంగా స్వతంత్ర భారతం కోసం బలి ఇచ్చిన ఎందరో త్యాగధనులు వేసిన బాటలో ఈనాటి మన బతుకు బండి సాగుతోంది. ఇది మనం మర్చిపోతే మన భవిష్యత్తు అంధకారం. ఆ భయంతోనే ఈ ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ జ్ఞాపకాలు, ఈనాటి తరానికి అవసరం.
    జాతిపిత గాంధీ మహాత్ముడు భారత స్వాతంత్య్ర పోరాట రథసారధి అని జాతియావత్తూ కొనియాడుతోంది. కాని మహాత్మునికి నీడగా వెన్నంటి, ఎల్లవేళలా తోడు నీడగా నిలచిన అసమాన త్యాగమయి, కస్తూరిబాయి. దేశంలోని బిడ్డలందరూ బానిసత్వంలో మ్రగ్గుతుంటే తన బిడ్డలకు మాత్రం మంచికోరటం అనే స్వార్థచింతన స్వాతంత్ర పోరాటంలో పాల్గొన నీయదు అని తలచిన చైతన్యమూర్తి ఆమె. అటువంటి అనన్య త్యాగాలతో సాధించిన, స్వతంత్ర భారతం నేడు సామ్రాజ్యవాదం ముందు చేతులు కట్టుకొని నిలబడే దుస్థితిలోకి నెట్టబడింది. ప్రయివేటీకరణ విధానాలతో, దోపిడీ శక్తులు విజృంభించి అవినీతి భారతంగా మార్చాయి దనంపేరుతో, కుల, మతాల పేరుతో ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టి దేశాన్ని వల్లకాడుగా మార్చుతున్నా నేడు కేంద్రంలోని బిజెపి పాలకులు మరోవైపు బంగారు పంటలు పండించే అన్నదాతలు అప్పులు పాలై దిక్కుతోచక ఆత్మహత్యల బారిన పడుతున్నారు. ఈ సందర్భంగా ఒక దేశభక్తుడు ఆవేదనతో రాసిన గేయం ఒకటి గుర్తుకొస్తోంది.
''ఓహో ఈ స్వాతంత్య్రం, హాహాకారాలమయం,
అన్యాయం, అక్రమాల సమ్మిశ్రిత బలిపీఠం''
అందుకే మరో స్వతంత్రోద్యమానికి భారతజాతి సన్నద్ధం కావాలి. ఆనాటి త్యాగాల చరితం మరల తన చైతన్యశక్తిని చాటాలి. అందుకనే కస్తూరి మాత మనసులో మెదులుతోంది.
కస్తూరిబా గుజరాత్‌ రాష్ట్రంలోని, రాజ్‌కోట్‌లో1869లో జన్మించింది. బాపుజీ (గాంధీ) కూడా రాజ్‌కోట్‌లోనే అదే సంవత్సరంలో పుట్టారు. కస్తూరిబాయి తండ్రి గోకులదాస్‌. గాంధీజీ తండ్రి కాబా ఇద్దరూ స్నేహితులు. కస్తూరిబాయికి 12వ ఏటనే గాంధీజీతో వివాహం అయింది. కస్తూరిబాకు 16వ ఏటనే ఒక బిడ్డపుట్టి చనిపోయింది. మరల 18వ ఏట హీరాలాల్‌ పుట్టాడు. తరువాత మణిలాల్‌ పుట్టాడు. 1896లో ఆమె ఇద్దరు కొడుకులతో సహా గాంధీజీ వెంట దక్షిణాఫ్రికాకు వెళ్లి అక్కడ 1914 వరకూ ఉన్నారు. అక్కడ జరిగిన సత్యాగ్రహోద్యమాలన్నింటా కస్తూరిబా పాల్గొని, జైళ్లకు వెళ్లి, ఎన్నో అష్టకష్టాలను భరించి తిరిగి 1915లో భర్త గాంధీజీతో కలిసి భారతదేశానికి వచ్చారు.
దక్షిణాఫ్రికాలో ఉండగా, కస్తూరిబాకు, రామదాస్‌, దేవదాస్‌ అనే ఇద్దరు కొడుకులు పుట్టారు. ఆమెను ఒకసారి దక్షిణాఫ్రికాలో ఉండగానే గాంధీజీ, చిన్న అభిప్రాయ భేదం వచ్చి బయటకు వెళ్లిపొమ్మన్నారు. కాని కస్తూరిబా చలించకుండా భారత స్వతంత్ర పోరాటంలో నీతో కలిసి పాల్గొనాలని వచ్చాను, నేను వెళ్లను అని జవాబు చెప్పింది. భర్తతో, చంటి బిడ్డలతో, ఎన్నో కఠిన పరీక్షలు ఎదుర్కొంటూ ఓర్పుతో, నేర్పుతో దేశవిముక్తికి తన జీవితం ధారపోసింది కస్తూరిమాత. భారతదేశానికి వచ్చాక ఇక్కడ సాగిన స్వతంత్రోద్యమంలో పాల్గొన్ని అనేకసార్లు జైళ్లకు వెళ్లింది. చివరకు కస్తూరిబా 1944లో ఆగాఖాన్‌ భవనపు జైలులో గాంధీజీ ఒడిలోనే ప్రాణాలు వదిలింది.


                               అంతటి అపురూప త్యాగమయి కస్తూరిబా జీవితంలో కొన్ని సంఘటనలు.

1. ఒకరోజు ఉపవాసం చేస్తున్న బాపూజీ వద్దకు కస్తూరిబా వెళ్లి నమస్కరించి ఉపవాసం విరమించమని అర్ధించింది. అందుకు గాంధీజీ నీవు కూడా ఉపవాసం చేయి. కాని నీ బుగ్గలు చొట్టపోయాయి చూడు నీవు నాకంటే బక్కచిక్కపోయావు. మీ వంటాయన నీకు బాగా తిండిపెట్టటం లేదన్న మాట. మా వంటాయన నాకు బాగా తిండిపెడుతున్నాడు'' అని గాంధీజీ అంటే, కస్తూరిబా లేదు లేదు మా వంటాయన సింధీవాళ్లు, అందరికన్నా మంచివాళ్ళు అన్నారు. సింధీలు అంటే సింధు రాష్ట్రం వాళ్లు. సింధురాష్ట్రం పంజాబ్‌ను ఆనుకుని ఉన్నది. ఇప్పుడు అది పాకిస్తాన్‌లో ఉన్నది.
2. ఒకసారి కస్తూరిబా గాంధీజీతో రైలులో ప్రయాణిస్తుండగా ఆ రైలు బోగీలోనే, యాచకుడుగా వచ్చిన తమ కొడుకు, తల్లి కస్తూరిబానే బిక్షం అడిగిన హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది ఆ సమయంలో, ఆ తల్లి అనుభవించిన క్షోభ చెప్పనలవి కానిది.
3. ఇంకొకసారి కస్తూరిబా గాంధీజీతో ఎక్కడికో వెళ్ళడానికి, పెట్టెలు బట్టలు సర్దుకొంటుండగా పెట్టెలో బట్టలు అడుగున, ఒక బంగారు గొలుసు గాంధీజీకి కనిపించింది. అది చూసి గాంధీజీ బిత్తరపోయి ఇది ఎందుకు దాచావు అని భార్య కస్తూరిబాను అడిగితే, కస్తూరిబా తన గుండెలో దాచుకున్న చిన్న ఆశ అది అని చెప్పి, నా కొడుకులు ఎవరైనా పెండ్లి చేసుకున్నప్పుడు, కోడలికి ఇవ్వాలని, అదొక్కటే దాచుకున్నాను అని చెప్పింది. దానికి గాంధీజీ దేశంలోని బిడ్డలందరూ నీకొడుకులేకదా? ఈ ఒక్కటి ఎవరికిస్తావు అన్నారు? కాని తల్లి, తన రక్త మాంసాలు పంచి ఇచ్చి కన్న తన బిడ్డల మీద అంతరాంతాల్లో దాగి ఉన్న ప్రకృతి సహజమైన మమకారం అది.
4. కస్తూరిబా, గాంధీ సబర్మతీ ఆశ్రమంలో ఉన్న వేళ. ఆశ్రమంలో ఉన్న సత్యాగ్రహులందరూ వంతులవారీగా ఆశ్రమం లోని పనులన్నీ చేసేవారు. స్త్రీలైనా, పురుషులైనా, పని సమానమే. వంటచేయటం, పరిసరాలు శుభ్రం చేయటం, కూరలు తరగటం, గిన్నెలు తోమటం వగైరా సమస్త పనులు ఎంతో క్రమశిక్షణతో చేసేవారు.
ఒకరోజు పాయఖానా తుడవటం, కస్తూరిబా వంతు వచ్చింది. దానికి ఆమె గాంధీజీతో నేను ఈ ఒక్క పనిచేయలేను. మిగిలిన పని ఎంతటి కష్టమైనయినా చేస్తాను అని చెప్పారు. అందుకు గాంధీజీ సరే నీ వంతు నేను చేస్తానులే అని, పాయఖానా శుభ్రం చేసే ఆమె వంతు పని తను పూర్తిచేశారు.
అది మొదలు ఇక ఎప్పుడూ కస్తూరిబా ఆ మాట అనలేదు. పాయఖానా ఎత్తటం మొదలైన పనులన్నీ పూర్తిచేసేవారు. అంతటి మానవత, చైతన్యం ఉట్టిపడే గొప్ప ధన్యజీవి కస్తూరాబాయి.
200 సంవత్సరాలుగా బ్రిటిష్‌ సామ్రాజ్య వాదుల కబంధ హస్తాల్లో నలిగిపోతున్న మాతృదేశ విముక్తి కోసం అత్యున్నత మానవతా విలువలతో, తన సర్వస్వం ధారపోసిన అపురూప త్యాగమయి కస్తూరిమాత. జాతి సంక్షేమమే జీవిత పరమార్ధంగా వారి త్యాగాల మార్గంలో ఈతరం పయనించాలి.
 

అట్లూరి మన్మోహనీ