Aug 17,2023 14:58

హైదరాబాద్‌ : స్వాతంత్రం దినోత్సవం రోజున మహిళపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారు పోలీసులు. నడుచుకుంటూ వస్తున్న మహిళపై పోలీసు వాహనంలో ఎక్కించుకొని మరి పోలీసులు ప్రతాపం చూపించారు. రాత్రంతా పోలీస్‌ స్టేషన్లో ఉంచి చిత్రహింసలు గురిచేశారు. ఎల్బీనగర్‌ పోలీస్‌ స్టేషన్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. మీర్‌ పేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని నంది హిల్స్‌ కాలనీ రోడ్‌ నెంబర్‌ 4లో ఉంటున్న వరలక్ష్మి భర్త లేడు తన కూతురు పెండ్లి కోసం ఎల్బీనగర్‌ నుంచి సరూర్‌ నగర్‌ రోడ్డు వైపులోని బంధువుల ఇంటికి డబ్బులు తీసుకురావడానికి వెళ్ళింది. ఆగస్టు 15 మంగళవారం రాత్రి తిరిగి ఎల్బీనగర్‌ వస్తుండగా ఎల్బీనగర్‌ సర్కిల్లో పోలీసులు తమ వాహనంలో ఎక్కించుకుని పోలీస్‌ స్టేషన్‌ కు తరలించి ఆమెను చిత్రహింసలకు గురిచేసి రాత్రంతా పోలీస్‌ స్టేషన్లో ఉంచి థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారు. ఆమె ఎదురు తిరిగితే నీ సంగతి తెలుసు అంటూ నానా ఇబ్బందులు గురిచేసి రాత్రంతా వదలకుండా ఉన్నారని అన్నారు. ఉదయం ఏడు గంటలకు వేరే ఆఫీసర్‌ వచ్చి ఇంటికి పంపించాడని అన్నారు. పోలీసులు దాడిలో బాధితురాలు నడవలేని స్థితికి చేరుకున్నారు. అకారణంగా పోలీసులు తనని కొట్టారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. మహిళ పట్ల పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.