Oct 02,2023 14:24
  • కాలు విరగ్గొట్టిన ఇద్దరు కానిస్టేబుళ్లు, ఎస్‌ఐ సస్పెన్షన్‌

ప్రజాశక్తి - ఎంవిపి.కాలనీ, పద్మనాభం (విశాఖపట్నం) : ఓ దొంగతనం కేసులో నిందితునిగా ఉన్న దళితుడిపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించిన పోలీసులు సస్పెన్షన్‌కు గురయ్యారు. నిందితుడి కాలు విరగ్గొట్టారని ప్రాథమిక విచారణలో తేలడంతో విశాఖ జిల్లా పద్మనాభం పోలీసు స్టేషన్‌కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు, ఎస్‌ఐను సస్పెండ్‌ చేస్తూ నగర పోలీసు కమిషనర్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వారిపై ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసు నమోదు చేశారు. సిఐ సన్యాసినాయుడుకు ఛార్జిమెమో ఇచ్చారు. ఈ కేసు వివరాలను సిఐ సన్యాసినాయుడు మీడియాకు వెల్లడించారు. విశాఖప్నటం జిల్లా పద్మనాభం మండలంలోని భాందేవుపురం గ్రామానికి చెందిన ఇందుకూరు రాజబాబుకు చెందిన కోడిపుంజును అదే గ్రామానికి చెందిన పాపు, గాలి ఎర్నిబాబు దొంగిలించారంటూ గత నెల 29న పద్మనాభం పోలీసులకు ఫిర్యాదు అందింది. ప్రతిరోజూ నిందితులను సాయంకాలం విచారిస్తున్నారు. ఆదివారం రాత్రి 10 గంటలు అయినా పాపును విడిచిపెట్టకపోవడంతో ఆయన బంధువులు స్టేషన్‌కు వచ్చారు. స్టేషన్‌లో పాపు కేకలు, ఏడుపులు వినిపించడంతో బంధువులు లోపలకు వెళ్లారు. అప్పటికే ఆయన కాలు విరిగి స్పృహ కోల్పోయి ఉన్నాడు. ఆయనను విజయనగరంలోని మహారాజా ఆస్పత్రికి తీసుకెళ్లారు. నిందితుడిని పోలీసులు కొట్టారన్న విషయం తెలియగానే గ్రామంలోని కొంతమంది స్టేషన్‌ వద్ద ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే కానిస్టేబుళ్లు సతీష్‌, శ్రీనివాస్‌ గోడదూకి పరారయ్యారు. ఈ విషయాన్ని క్రైమ్‌ ఎస్‌ఐ మల్లేశ్వరరావు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్నారు. ఆందోళనకారులతో క్రైమ్‌ డిసిపి నాగన్న, దిశా పోలీస్‌ స్టేషన్‌ ఎసిపి వివేకానంద మాట్లాడారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో కానిస్టేబుళ్లు, ఎస్‌ఐపైనా చర్యలు తీసుకున్నారు.