- రెండు శాతమే పూర్తి
- ఐదు నెలలుగా నిలిచిన ఫిషింగ్ హార్బర్
- నిర్మాణం నిధుల కొరత, భూసేకరణ సమస్యలే కారణం
ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి : కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ సమీపంలోని అమీనాబాద్ తీరంలో చేపట్టిన ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులు ఐదు నెలలుగా నిలిచిపోయాయి. నిధుల విడుదలలో తీవ్ర జాప్యం, భూసేకరణ పూర్తి కాకపోవడం ఇందుకు కారణమని అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే తీర ప్రాంత మత్స్యకారుల చిరకాల వాంఛ ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో కొత్తగా తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు, నాలుగు ఫిషింగ్ ల్యాండింగ్ కేంద్రాలు నిర్మించతలపెట్టింది. వీటిలో భాగంగా ఉప్పాడ సమీపంలో రూ.422 కోట్ల వ్యయంతో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి 2020 డిసెంబరులో ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌రెడ్డి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. నిర్మాణ పనులను ఎపి మెరైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎపిఎంఐడిసి) పర్యవేక్షణలో ఎంఆర్‌కెఆర్ కనస్ట్రక్షన్ అండ్ ఇండిస్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాణాన్ని చేపట్టింది. గత 20 నెలల్లో రెండు శాతంలోపే పనులు జరిగాయి. మేజర్ హార్బర్‌ను 2,500 బోట్లు నిలిపి ఉంచేలా నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు. బోట్లు నిలిపేలా ప్లాట్ ఫామ్, 40 టన్నుల సామర్థ్యం కలిగిన రెండు ఐస్ ప్లాంట్లు, 980 టన్నుల సామర్థ్యంగల గిడ్డంగులు, బోట్లు తయారీ, మరమ్మతుల యార్డు నిర్మించాల్సి ఉంది. ఈ పనులు పూర్తయితే 1.10 లక్షల మెట్రిక్ టన్నుల అదనపు మత్స్య సంపద సేకరణకు వీలుంటుందని అధికారులు అంచనా వేశారు. సుమారు 50 వేల మంది మత్స్యకారులకు నేరుగా ప్రయోజనం కలగనుందని ప్రకటించారు. ఈ సౌకర్యాలు ఇప్పటి వరకు సమీపంలోని కాకినాడలోనే ఉన్నాయి. ఇక్కడ పోర్టు కార్యకలాపాల వల్ల ఫిషింగ్ బోట్లకు ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో ఉప్పాడ ఫిషింగ్ హార్బరు నిర్మాణం తలపెట్టారు. ఇప్పటివరకు సుమారు రూ.9 కోట్ల ఖర్చు చేశారు. రెండు శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి పనులు నిలిచిపోయాయి. పిల్లర్ల కోసం సిద్ధం చేసి ఆరు బయట ఉంచిన ఐరన్, ఇనుప గడ్డర్లు తుప్పు పడుతున్నాయి. ఆఫ్‌షోర్‌లో పనుల కోసం గతంలో వేసిన గాంట్రా అప్రోచ్ వర్క్ కూలిపోయింది. మొత్తం 50 ఎకరాల భూమి అవసరం కాగా, ఇందులో 12 ఎకరాల భూమిని స్థానిక రైతుల నుంచి ఇంకా సేకరించాల్సి ఉంది. రైతులకు పరిహారం విషయాన్ని ఎటూ తేల్చలేదు. మరో ఐదారు నెలల వరకు పనులు మళ్లీ మొదలయ్యే అవకాశం లేవని చెప్తున్నారు.
త్వరితగతిన పూర్తయ్యేందుకు చర్యలు
నిధుల విడుదలలో కొంత జాప్యం వల్ల హార్బర్ నిర్మాణ పనులు నిల్చిపోవడం వాస్తవమే. అతి త్వరలో పనులను మళ్లీ మొదలుపెట్టి వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం.
- మునిరెడ్డి, ఇఇ, ఎపిఎంఐడిసి










