Feb 15,2023 21:50

మూడు ఫార్మాట్‌లలో అగ్రస్థానం
దుబాయ్: భారత పురుషుల క్రికెట్‌ జట్టు సరిక్రొత్త రికార్డును నెలకొల్పింది. అంతర్జాతీయ క్రికెట్‌మండలి(ఐసిసి) బుధవారం ప్రకటించిన టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరి మూడు ఫార్మాట్‌లలో అగ్రస్థానంలో నిలిచిన జట్టుగా ఈ ఫీట్‌ను అందుకుంది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ఇండియా ఇన్నింగ్స్‌ తేడాతో విజయం సాధించడంతో భారతజట్టు పాయింట్ల సంఖ్య 115కు చేరింది. నాలుగు పాయింట్ల తేడాతో ఆస్ట్రేలియా రెండవ స్థానంలో ఉంది. తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్‌(106పాయింట్లు) మూడోస్థానంలో నిలిచింది. ఇక భారత స్పిన్నర్లు అశ్విన్‌, జడేజాలు కూడా టెస్టుల్లో తమ తమ ర్యాంక్‌లను మెరుగుపరుచుకున్నారు. ఆసీస్‌తో జరిగిన తొలి టెస్టులో వీరిద్దరూ రాణించగా.. అశ్విన్‌ 21వ స్థానంలో నిలువగా.. ఆల్‌రౌండర్ల విభాగంలో జడేజా టాప్‌లో నిలిచాడు. ఇక బ్యాటర్స్‌ జాబితాలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 8వ స్థానంలో ఉన్నాడు.