- సెమీస్‌లో ఇంగ్లండ్‌పై ఆరు పరుగుల తేడాతో గెలుపు
- 26న టైటిల్‌కై ఆసీస్‌తో ఢీ
కేప్‌టౌన్ : ఐసిసి మహిళల టి20 ప్రపంచకప్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు పెను సంచలనాన్ని నమోదు చేసింది. శుక్రవారం జరిగిన రెండో సెమీఫైనల్లో టైటిల్ ఫేవరెట్ ఇంగ్లండ్‌పై ఆరు పరుగుల విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో టి20 ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి దక్షిణాఫ్రికా మహిళలజట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ టోర్నీలో ఆతిథ్య జట్టు అత్యుత్తమ ప్రదర్శన 2014లో సెమీస్‌కు చేరడమే. శుక్రవారం జరిగిన సెమీస్ పోటీలో ఇంగ్లండ్ విజయం నల్లేరుమీద నడకేనని భావించినా.. అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ దక్షిణాఫ్రికా మహిళలజట్టు చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. టాస్ గెలిచి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 164పరుగులు చేసింది. ఓపెనర్లు వోల్వోడాట్(53), బ్రిట్స్(68) అర్ధసెంచరీలతో మెరిసారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 96పరుగులు జతచేశారు. ఆ తర్వాత కాప్(27) మాత్రమే బ్యాటింగ్ లో రాణించింది. ఎక్లేస్టోన్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఛేదనలో ఇంగ్లండ్ ఓపెనర్లు వాట్(34), డంక్లే(28), బ్రంట్(40), నైట్(31) రాణించినా.. చివర్లో ఒత్తిడికి గురై వరుసగా వికెట్లు కోల్పోయింది. దీంతో నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 8వికెట్లు కోల్పోయి 158పరుగులే చేయగల్గింది. ఖాకాకు నాలుగు, ఇస్మాయిల్‌కు మూడు వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ బ్రిల్స్‌కు లభించింది. దీంతో దక్షిణాఫ్రికా మహిళలజట్టు చరిత్రలో తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లగా.. ఆదివారం జరిగే ఫైనల్లో దక్షిణాఫ్రికా జట్టు 5సార్లు టి20 ఛాంపియన్ ఆస్ట్రేలియాతో తలపడనుంది.










