Apr 10,2023 09:04
  • ముందుకు సాగని రెండో దశ పనులు       

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన మన బడి నాడు-నేడు రెండో దశ పనులు నత్తనడకన సాగుతున్నాయి. 2021లో చేపట్టిన పనులు ఇప్పటికీ సాగుతూనే ఉన్నాయి. 22,344 పాఠశాలల్లో రెండో దశ నాడు-నేడు కింద మౌలిక వసతులు, అదనపు తరగతి గదులు కల్పించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తం రూ.8వేల కోట్లతో అంచనా వేసింది. 2021లో రెండోదశ కింద రూ.4,400 కోట్లతో 15 వేల పాఠశాలల్లో మాత్రమే ఈ పనులు చేపట్టాలని నిర్ణయించుకొని, తరువాత వీటిని 22,344 పాఠశాలలకు విస్తరించింది. ఎంపిక చేసిన పాఠశాలల్లో పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. ఇప్పటివరకు నిధులు విడుదల కాకపోవడం, నిర్మాణ రంగానికి కావాల్సిన మెటీరియల్‌ సరఫరా చేయకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. రెండోదశ పనులపై ఇటీవల పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఎక్కడి పనులు అక్కడే నిలిచినట్లు గుర్తించారు. నాడు-నేడు సబ్‌ కంపౌండ్స్‌ పనులు అసలు ప్రారంభం కాలేదని విద్యాశాఖ గుర్తించింది. గ్రీన్‌ చాక్‌ బోర్డులు, అదనపు తరగతి గదులు, ప్రహారీ ఇతర పనులను ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభించాలని ఆదేశించింది. పాఠశాలలు ప్రారంభించే జూన్‌ 12వ తేదీలోపు మొత్తం నాడు-నేడు పనులను పూర్తిచేయాలని పేర్కొంది. చిన్న, పెద్ద మరమ్మతులను మే 15వ తేదీలోపు పూర్తిచేయాలని పేర్కొంది. నిర్మాణానికి కావాల్సిన సిమెంట్‌, ఐరన్‌, ఇతర మెటీరియల్‌ పంపకుండా పనులు ఎలా పూర్తిచేయాలని పాఠశాలల తల్లిదండ్రుల కమిటీలు, ప్రధానోపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు నిధులు మంజూరు కూడా సక్రమంగా లేదు. మొత్తం రూ.8వేల కోట్ల నిధులలో రూ.2,544 కోట్లు విడుదలవ్వగా, ఇప్పటి వరకు రూ.1768 కోట్లు ఖర్చు చేసింది. ఇంకా రూ.6,232 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంది. ప్రస్తుత విద్యాసంవత్సరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల్లోని 3, 4, 5 తరగతుల విద్యార్థులను కిలోమీటర్‌ పరిధిలో ఉన్న ఉన్నత పాఠశాలలకు తరలించింది. ఈ ప్రక్రియ 5,240 పాఠశాలల్లో జరిగింది. వచ్చే విద్యాసంవత్సరం కూడా ఈ తరగతుల తరలింపు చేపడతామని ప్రభుత్వం చెబుతోంది. తరలించిన పాఠశాలల్లో అదనపు గదులు కచ్చితంగా నిర్మించాల్సి ఉంది. సుమారుగా 22వేల అదనపు తరగతులు అవసరమవుతాయని విద్యాశాఖ అంచనా వేసింది. నిధులు మంజూరు చేయకుండా, అవసరమైన మెటీరియల్‌ అందించకుండా అదనపు తరగతి గదులు ఎలా పూర్తవుతాయని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. అవసరమైన గదులు లేకుండా విద్యార్థులను తరలిస్తే ఇబ్బందిపడక తప్పదని చెబుతున్నారు.