Apr 07,2023 10:11
  •  జంతర్‌మంతర్‌లో రైతన్నల డిమాండ్‌
  • బకాయిలన్నీ చెల్లించాలి
  • మూసివేసిన షుగర్‌ మిల్లులు తెరవాలి
  • ప్రైవేటీకరణ ఆపాలి

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఢిల్లీ వీధుల్లో చెరుకు రైతులు కదంతొక్కారు. కనీస మద్దతు ధర కల్పించాలని, బకాయిలు తక్షణమే చెల్లించాలని, ప్రభుత్వ, సహకార చక్కెర మిల్లుల ప్రయివేటీకరణ ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్‌ చేస్తూ అఖిల భారత చెరుకు రైతుల సమాఖ్య (ఎఐఎస్‌సిఎఫ్‌ఎఫ్‌) ఆధ్వర్యంలో స్థానిక జంతర్‌మంతర్‌ వద్ద గురువారం జరిగిన ఈ ఆందోళనల్లో దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన చెరుకు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పది రాష్ట్రాల నుంచి చెరుకు రైతుల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎఐఎస్‌సిఎఫ్‌ఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి రవీంద్రన్‌, ఎన్‌కె శుక్లా మాట్లాడుతూ చెరుకు ధరను 9.5 శాతం రికవరీతో టన్నుకు రూ.5 వేలు చొప్పున చెల్లించాలని, సహకార, ప్రభుత్వ రంగ షుగర్‌ మిల్లుల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్‌ చేశారు. మూసివేసిన సహకార, ప్రభుత్వ రంగ చక్కెర కర్మాగారాలను తెరవడానికి, నిర్వహించడానికి జాతీయ సహకారాభివృద్ధి సంస్థ ద్వారా వడ్డీ రహిత రుణాలను అందజేయాలని కోరారు. 40 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన సహకార, ప్రభుత్వ రంగ మిల్లులను పునరుద్ధరించి ఆధునీకరించాలన్నారు. 2025 నాటికి ఇథనాల్‌ ఉత్పత్తిని పెంచే ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని, దేశవ్యాప్తంగా ఉన్న సహకార చక్కెర కర్మాగారాల్లో ఇథనాల్‌ ప్లాంట్‌లను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. 1966 షుగర్‌ కంట్రోల్‌ ఆదేశాల ఆధారంగా సరఫరా చేసిన చెరకుకు 14 రోజుల్లోగా సొమ్మును చెల్లించి, బకాయిలన్నీ వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు.
 

                                     కార్పొరేట్ల ప్రయోజనాలకే రంగరాజన్‌ కమిటీ : విజూ కృష్ణన్‌

ఎఐకెఎస్‌ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్‌ మాట్లాడుతూ రంగరాజన్‌ కమిటీ రిపోర్టును తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఆ రిపోర్టు కేవలం కార్పొరేట్ల ప్రయోజనాల కోసం రూపొందించినట్లు ఉందన్నారు. చెరకు రైతులకు రూ.23 వేల కోట్లు బకాయిలు ఉన్నాయని, వాటిని రైతులకు ఇప్పటికీ కూడా ఇవ్వలేదని వాపోయారు. చెరుకు రైతుల సమస్యలు చెప్పుకుందామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అపాయింట్‌మెంట్‌ ఇవ్వాలని కోరితే, బిజెపి వ్యవస్థాపక దినోత్సవం ఉందని, తాను అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేనని కేంద్ర మంత్రి అనడం దారుణమన్నారు. కేంద్ర మంత్రులు రైతుల హితం కోరుకోవడం లేదని, కార్పొరేట్ల లాభాలే లక్ష్యంగా పని చేస్తున్నారని విమర్శించారు. ఏపి, తెలంగాణలో టయోట వంటి బహుళ జాతి కంపెనీలను తీసుకొచ్చేందుకు ప్రయత్నం జరుగుతోందని, ఇతర దేశాల్లోంచి షుగర్‌ను దిగుమతి చేసేందుకు కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. అందుకనే షుగర్‌పై దిగుమతి సుంకం తగ్గిస్తున్నారని విమర్శించారు. ేశంలోని షుగర్‌ మిల్లులను మూసివేసి, రైతులకు నష్టం చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బల్వాన్‌ సింగ్‌ (హర్యానా), ప్రభురాజ్‌ ఎన్‌.రావు (బీహార్‌), ఎల్‌.మారన్‌ (తమిళనాడు), మారారిల్లా ఠాకూర్‌ (మధ్యప్రదేశ్‌), ఉమేష్‌ దేశ్‌ముఖ్‌ (మహారాష్ట్ర), పుష్పేంద్ర త్యాగి (ఉత్తరప్రదేశ్‌), ఎఐకెఎస్‌ నేతలు హన్నన్‌ మొల్లా, కృష్ణ ప్రసాద్‌, బాదల్‌ సరోజ్‌ తదితరులు పాల్గొన్నారు.

The-price-of-sugarcane-is-Rs-5-thousand-per-ton


                                                 ఏపిలో 24 ఫ్యాక్టరీలు మూసివేత : కర్రి అప్పారావు

ఆంధ్రప్రదేశ్‌ చెరుకు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కర్రి అప్పారావు మాట్లాడుతూ చెరుకు రైతుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దుర్మార్గంగా వ్యవహరించడంతో అత్యంత కష్టాలు పడుతున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పది సహకార షుగర్‌ ఫ్యాక్టరీలతో సహా 29 షుగర్‌ ఫ్యాక్టరీలు ఉండేవని, అయితే అందులో తొమ్మిది సహకార షుగర్‌ ఫ్యాక్టరీలతో 24 ఫ్యాక్టరీలను మూసివేశారని తెలిపారు. ప్రస్తుతం ఒక సహకార షుగర్‌ ఫ్యాక్టరీతో సహా కేవలం ఐదు ఫ్యాక్టరీలు మాత్రమే పని చేస్తున్నాయని అన్నారు. జగన్మోహన్‌ రెడ్డి పాలనలోనే 18 షుగర్‌ ఫ్యాక్టరీలు మూసివేశారని విమర్శించారు. రాష్ట్రంలో ఐదు లక్షల ఎకరాల్లో చెరకు సాగు అయ్యేదని, గిట్టుబాటు లేక సాగు 1.40 లక్షల ఎకరాలకు పడిపోయిందని తెలిపారు. ఐదు ఫ్యాక్టరీలు రైతులకు ఇవ్వాల్సిన రూ.200 కోట్ల బకాయిలు చెల్లించలేదని, బకాయిలు వెంటనే చెల్లించాలని ఉద్యమిస్తే 95 మంది రైతులపై కేసులు బనాయించారని వివరించారు. ఒక్క విజయనగరం జిల్లాలోనే 37 మంది మహిళలతో సహా రైతులపై కేసులు బనాయించారని విమర్శించారు. జగన్మోహన్‌ రెడ్డి ఎన్నికలకు ముందు చెరకుకు ఇతర రాష్ట్రాల్లో ఇచ్చేదానికి తక్కువ లేకుండా ప్రోత్సాహకం ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ దాన్ని ఇప్పటి వరకు అమలు చేయలేదని విమర్శించారు. దేశంలోని రెండో అతిపెద్ద బెల్లం మార్కెట్‌ అనకాపల్లిలో ఉందని, దాన్ని నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. సారా, బ్రాందీకి బెల్లం వెళ్తుందనే నెపంతో అక్కడి బెల్లాన్ని నిరోధిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ప్రభాకర్‌ రెడ్డి, చెరుకు రైతుల సంఘం నేతలు రాంబాబు, గండి నాయన బాబు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.