Jul 27,2022 09:51
  • పోలవరం నిర్వాసిత మండలాల్లో వరద బాధితుల పరిస్థితి దయనీయం
  • ముంపు తగ్గినా గుడారాల్లోనే జీవనం

ప్రజాశక్తి- చింతూరు, ఎటపాక (అల్లూరి సీతారామరాజు జిల్లా) : ఎగువన కురిసిన వర్షాలకు ఇటీవల గోదావరి పోటెత్తడంతో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పోలవరం నిర్వాసిత మండలాలైన చింతూరు, ఎటపాక, విఆర్‌.పురం, కూనవరంల్లో వేల మంది బతుకులు అతలాకుతలమయ్యాయి. ఎత్తు, పల్లాలు అన్న తేడా లేకుండా ప్రవహించిన గోదావరి వరదతో పూరిళ్లు, పాత పెంకుటిళ్లు కుప్పకూలాయి. మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి. వరద ప్రభావంతో కూలిన, ధ్వంసమైన ఇళ్ల సర్వేలో ప్రభుత్వాధికారులు నిమగమయ్యారు. తాజా లెక్కల ప్రకారం... పైనాలుగు మండలాల్లో సుమారు 623 ఇళ్లు పూర్తిగా, 343 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనా వేశారు. ఇప్పుడిప్పుడే ముంపు బారి నుంచి గ్రామాలు తేరుకుంటున్న క్రమంలో అక్కడి పరిస్థితులు దయనీయంగా ఉన్నాయి. వేల సంఖ్యలోనే ఇళ్లు కొట్టుకుపోయినట్టు బాధితులు చెబుతున్నారు. రాకపోకలకు ఇంకా ఇబ్బందులు ఉన్నాయని, సర్వే పూర్తి స్థాయిలో జరిగితే ఆస్తి, ఇళ్ల నష్టం ఎంత జరిగిందనేది ఓ అంచనాకు వస్తామని అధికారులు చెబుతున్నారు. ఎటపాక మండలంలోని మురుమూరు, నందిగామ, ఎర్రగట్టు, గన్నవరం, వీరాయిగూడెం, నెల్లిపాక, రాయనపేట, గుండాల గ్రామాల్లో ఎక్కువ ఇళ్లు కూలిపోయాయి. చింతూరు మండల కేంద్రంలోని బిసి కాలనీ, శబరి ఒడ్డు ప్రాంతాల్లో ఇళ్లకు తీవ్ర నష్టం జరిగింది. మల్లెతోట గ్రామంలో 30 గుడిసెలు కొట్టుకుపోయాయి. విఆర్‌.పురం, కూనవరం మండలాల్లో ప్రతి గ్రామంలోనూ గుడిసెలు కూలిపోవడంతో వందలాది మంది బాధితులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వీరికి ప్రభుత్వ సాయం కరువవడంతో రోడ్డు పక్క జాగాల్లో, ఖాళీ ప్రదేశాల్లో, బంధువుల స్థలాల్లో గుడారాలు వేసుకుని జీవిస్తున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలి.

 

goodu

వరద ముంపులో నా ఇల్లు నాలుగు రోజుల పాటు ఉంది. గోడలు పడిపోయాయి. ప్రభుత్వం అందించిన రూ.2 వేలు సాయం కనీసం ఇంటిపై తాటాకులు వేసుకునేందుకు కూడా సరిపోవు. కరెంటు మీటరు తడిసిపోయింది. కొద్ది రోజులుగా అంధకారంలోనే ఉంటున్నాం. ప్రభుత్వం స్పందించి సురక్షిత ప్రాంతంలో మాకు ఇల్లు నిర్మించి ఇవ్వాలి. వరద నష్టపరిహారం వెంటనే చెల్లించాలి.
                                                                                    -షేక్‌ ఇమామున్నీసా, బిసి కాలనీ,

                                                                 చింతూరు నీడ కరువైంది

నా బతుకు గోదారి పాలైంది. ఇటీవల వరదలకు గుడిసె కూలిపోయి నీడ కరువైంది. సంతలో టీ అమ్ముకొని జీవించేదానిని. ఈ వరదలకు మా ఇంటి సామాన్లన్నీ నీట మునిగిపోయాయి. వారం రోజులపాటు పునరావాస కేంద్రంలోనే ఉన్నాను. వరద తగ్గిన తర్వాత వచ్చి చూస్తే ఇల్లు కూలిపోయి ఉంది. నాకు పునరావాసం కల్పించాలి.
                                                              -నీలాపు కనకరత్నం,

                                           శబరి ఒడ్డు, చింతూరు ప్రభుత్వాల నిర్లక్ష్యమే ఈ పరిస్థితికి కారణం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యమే నేటి ముంపు మండలాల్లో గోదావరి వరద విధ్వంసానికి కారణం. ముంపు మండలాల్లో ముందుగా పరిహారం ఇవ్వకుండా, పునరావాసం కల్పించకుండా కాపర్‌ డ్యామ్‌ నిర్మాణం చేపట్టి ప్రజలను ముంపులోకి నెట్టేశారు.
                                                                                      -ఎం.డి.షాహన్స్‌ షా, శబరి ఒడ్డు, చింతూరు