- భారత్-ఆస్ట్రేలియా చివరి వన్డే నేడు
- మధ్యాహ్నం 1.30గం||ల నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో
చెన్నై: వన్డే సిరీస్ ట్రోఫీ ఇరుజట్లను ఊరిస్తోంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇప్పటివరకు జరిగిన తొలి రెండు వన్డేల్లో ఇరుజట్లు ఒక్కో మ్యాచ్‌ను గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి. ముంబయి వేదికగా జరిగిన తొలి వన్డేల్లో టీమిండియా 5వికెట్ల తేడాతో ఆసీస్‌ను ఓడిస్తే.. విశాఖ వేదికగా జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా ఏకంగా 10వికెట్ల తేడాతో టీమిండియా చిత్తుచేసింది. ఈ క్రమంలో నిర్ణయాత్మక మూడో, చివరి వన్డే చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగనుంది. ఈ మైదానంలో కూడా బ్యాటర్స్ హవా కొనసాగనుంది. విశాఖ వేదికగా జరిగిన వన్డేలో ఆస్ట్రేలియా పేసర్ స్టార్క్ దెబ్బకు టీమిండియా బ్యాటర్స్ పెవీలియన్‌కు క్యూ కట్టారు. ఈ క్రమంలో టీమిండియా నిర్దేశించిన 118పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా కేవలం 11 ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా ఛేదించి వన్డే సిరీస్ రేసులో నిలిచింది. టెస్ట్ సిరీస్‌ను 2-1తో గెలిచిన టీమిండియా వన్డే సిరీస్‌ను కాపాడుకోవాలంటే ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి.
జట్లు(అంచనా)..
ఇండియా: రోహిత్(కెప్టెన్), శుభ్‌మన్, కోహ్లి, సూర్యకుమార్/సుందర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్, జడేజా, అక్షర్, కుల్దీప్, సిరాజ్, షమీ.
ఆస్ట్రేలియా: స్టీవ్ స్మిత్(కెప్టెన్), హెడ్, మిఛెల్ మార్ష్, లబూషేన్, క్యారీ(వికెట్ కీపర్), గ్రీన్, స్టొయినీస్, అబట్, ఎల్లీస్, స్టార్క్, జంపా.










