- కుశలవ భూముల్లో భూస్వాధీన పోరాటం
ప్రజాశక్తి - లేపాక్షి : శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలంలోని కొండూరు, కొర్లకుంట గ్రామాల్లో పరిశ్రమ ఏర్పాటు పేరుతో పేదల నుంచి కుశలవ సంస్థ సేకరించిన భూములను తిరిగి వారికే ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు డిమాండ్ చేశారు. కుశలవ సంస్థకు ఇచ్చిన భూముల్లోని పిచ్చిమొక్కలను దళితులు, పేద రైతులు గురువారం తొలగించి భూ స్వాధీన పోరాటాన్ని నిర్వహించారు. వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ పోరాటం నిర్వహించారు. ఈ సందర్భంగా దడాల సుబ్బారావు మాట్లాడుతూ.. పరిశ్రమ ఏర్పాటైతే ఉపాధి లభిస్తుందన్న ఆశతో సాగు భూములను దళితులు, పేద రైతులు ప్రభుత్వానికి ఇచ్చారన్నారు. అందులో భాగంగానే లేపాక్షిలో అసైన్డ్ భూములను కుశలవ అనే ప్రయివేటు సంస్థకు 600 ఎకరాలను ప్రభుత్వం కారుచౌకగా కట్టబెట్టిందని తెలిపారు. భూములు తీసుకున్న సంస్థ పరిశ్రమ స్థాపన కోసం కనీసం ఇటుక కూడా పేర్చలేదని విమర్శించారు. 150 ఎకరాలను ప్రయివేటు వ్యక్తులకు విక్రయించడంతో అధికారులు ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నారని, ఈ భూములను సాగుదారులకు ఇవ్వకుండా అసైన్డ్ భూ పంపిణీలో భూస్వాములకు కట్టబెట్టె కుట్ర జరుగుతోందన్నారు.అసైన్డ్ చట్టం ప్రకారం పేదల భూములను పేదలకు అప్పగించాలని డిమాండ్ చేశారు. భూ స్వాధీన పోరాటం విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకుని పేదలతో మాట్లాడారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తే అరెస్టులు చేస్తామని హెచ్చరించారు. దీనిపై వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న స్పందిస్తూ పేదలు ఆందోళన చేస్తుంటే కేసులు పెడతామని బెదిరించడం సరికాదన్నారు. హక్కుగానే పేదలు తమ భూములను స్వాధీనం చేసుకుంటున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా కమిటీ సభ్యుల నారాయణ, రాయుడు, భూ పోరాట సాధన కమిటీ సభ్యులు గోపాలకృష్ణ, రైతులు పాల్గొన్నారు.










