Jul 16,2022 13:56

అమరావతి : తెలుగు రాష్ట్రాల్లో వానలు-వరదలు బీభత్సాన్ని సృష్టించాయి. 100 ఏళ్ల చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడు జులై నెలలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. సాధారణంగా జులై నెలలో గోదావరికి వరదలు వచ్చినా ... ఈ స్థాయిలో ఎప్పుడూ రాలేదు. జులై లో వరదలు వచ్చినా.. లక్ష క్యూసెక్కులలోపే ఉండేవని గణాంకాలు చెబుతున్నాయి. ఆ రికార్డును ప్రస్తుతం వరదలు బ్రేక్‌ చేశాయి. గోదావరి వరద భయపెడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 10 కి పైగా జిల్లాలు వరదలో చిక్కుకొని బిక్కుబిక్కుమంటున్నాయి. పాత రికార్డులను బద్ధలుకొట్టిమరీ వరద దూసుకొస్తోంది.

>                                                          అతలాకుతలమైన ఉత్తర తెలంగాణ

ఉత్తర తెలంగాణలోని గ్రామాలు, పట్టణాలతోపాటు తాగునీటి ప్రాజెక్టులూ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. 1986 మేడిగడ్డ ప్రాంతంలో రికార్డయిన భారీ వరదను మించి గోదావరి ప్రవహిస్తుండటంతోపాటు ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌ ఉమ్మడి జిల్లాలతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గడ్‌ నుండి వస్తున్న వరదనీటికి మొత్తం ఉత్తర తెలంగాణ అతలాకుతలమయ్యింది. ప్రస్తుతం 122 మీటర్ల మేర వరద నీరు ప్రవహిస్తుండటంతో స్పిల్‌వే మీటర్లు సైతం మునిగిపోయాయి. దీనికితోడు ప్రాణహిత, పెన్‌గంగ, వార్థా లాంటి ఉపనదుల నుండి భారీ వరద చేరుతోంది.

                                                  ధవళేశ్వరం నుండి గోదావరికి పోటెత్తుతోన్న వరద

20 లక్షల క్యూసెక్కుల నీరు ధవళేశ్వరం నుండి గోదావరికి పోటెత్తుతోంది. ప్రస్తుతం గోదావరికి సంబంధించిన అన్ని ఉపనదుల నుండి వరదనీరు చేరుతోంది. కాళేశ్వరం ఆలయంలోకి వరదనీరు ప్రవేశించింది. ప్రాజెక్టు భద్రత కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలన్నీ నీటమునిగాయి. మిడ్‌మానేరు డామ్‌, శ్రీరామ్‌సాగర్‌, కడెంనారాయణరెడ్డి, శ్రీపాదసాగర్‌, ఎల్లంపల్లి, తదితర ప్రాజెక్టుల నుండి భారీస్థాయిలో వరదనీరు విడుదలవుతూనే ఉంది.

                                                                  నీటమునిగిన ప్రాజెక్టులు..

ఎప్పుడూ వరద రాని వార్థా ఉపనదికి గరిష్ఠ స్థాయిలో వరద నీరు చేరుతోంది. 162 మీటర్ల గరిష్ఠ ప్రమాద నీటిమట్టాన్ని దాటి వరద ప్రవహిస్తోంది. దీనివల్ల మహారాష్ట్రలో వరద విలయతాండవం చేస్తోంది. పెన్‌గంగలో వరద 97 మీటర్లు గరిష్టానికి చేరింది. ఆదిలాబాద్‌, మంచిర్యాలలో వరద గరిష్ఠ స్థాయిలో ప్రవహిస్తోంది. ఈ పరిస్థితుల వల్ల ప్రాజెక్టులన్నీ నీటమునిగి అతలాకుతలమవుతున్నాయి.

                                                         చిగురుటాకులా వణికిపోతోన్న భద్రాచలం..

గోదావరి మహోగ్రరూపం దాలుస్తోంది. ఎగువ ప్రాంతాల నుండి వస్తోన్న వరద ప్రవాహంతో గ్రామాలు, పట్టణాలు నీటమునిగాయి. భద్రాద్రి రాముని ఆలయాన్ని వరద తాకింది. భద్రాచలం పట్టణం చిగురుటాకులా వణికిపోతోంది. పలు కాలనీలు నీటమునిగాయి. అప్రమత్తమైన అధికారులు వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. వర్షాకాలం సీజన్‌ ప్రారంభంలోనే ఈ స్థాయిలో వరద పోటెత్తడంతో మరో రెండు నెలల పరిస్థితులు ఎలా ఉంటాయోనంటూ.. తీరప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

                                                      36 ఏళ్ల తరువాత గోదావరి వంతెనపై ఆంక్షలు...

ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 61.5 అడుగులకు చేరింది. 1986లో గోదావరికి వచ్చిన వరదలను దృష్టిలో పెట్టుకొని కరకట్టను పకడ్బందీగా నిర్మించారు. దాదాపు 80 అడుగుల మేర వరద వచ్చినా తట్టుకునేలా నిర్మించారు. అయినప్పటికీ లీకేజీ లోపాలు సాధారణంగా మారిపోయాయి. మళ్లీ 36 ఏళ్ల తరువాత గోదావరికి భారీగా వరద రావడంతో నీరు కరకట్టను తాకింది. మూడో ప్రమాద హెచ్చరికను దాటి 24 గంటలు గడవకముందే ప్రవాహ ఉధృతి ఏకంగా 8 అడుగులకు మించిపోయింది. గంటగంటకూ ప్రవాహం పెరిగింది. ఇప్పటికే ఏకంగా 18 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు వెళ్లినట్లు అధికారులు వెల్లడించారు. భద్రాచలం పట్టణానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఎగువ నుండి చేరుతోన్న వరదకు గోదావరి వారధి అతలాకుతలమయ్యింది. దీంతో అధికారులు వంతెనపై రాకపోకలను నిలిపేశారు. 36 ఏళ్ల తరువాత గోదావరి వంతెనపై ఆంక్షలు విధిస్తూ రాకపోకలు నిషేధించబడ్డాయి.

                                                               పోలవరం ప్రాజెక్టు వద్ద హైఅలర్ట్‌..

పోలవరం ప్రాజెక్టు వద్ద రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్‌ను ప్రకటించింది. 24 గంటలూ ప్రాజెక్టు వద్ద అధికారులు వరద ఉధృతిని సమీక్షిస్తున్నారు. ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. తూర్పుగోదావరిలో 8 వరద ప్రభావిత ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక దృష్టిపెట్టారు. ఎన్‌డిఆర్‌ఎఫ్‌, ఎస్‌డిఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దింపారు. గోదావరి పరీవాహక కరకట్టలను ఇసుక బస్తాలతో పటిష్టపరిచారు.

                                            ధవళేశ్వరం వద్ద పదేళ్లలో గరిష్ఠంగా నమోదయిన వరద నీరు

2006 తరువాత భద్రాచలం వద్ద అత్యధిక వరద నమోదయ్యింది. ఛత్తీస్‌గడ్‌లోనూ భారీ వర్షాలు కురియడం వల్ల శబరి ఉప్పొంగింది. తాలిపేరు, కిన్నెరసాని నుండి కూడా వరద పోటెత్తడంతో ఈనెల ధవళేశ్వరం వద్ద 10వ తేదీనాటికి వరద తాకిడి మొదలయ్యింది. నాలుగురోజుల్లోనే అది మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరింది. గడిచిన పదేళ్లలో ఇంత పెద్ద స్థాయిలో ధవళేశ్వరం వద్ద వరద ఎన్నడూ నమోదు కాలేదు. కోనసీమ 34 మండలాలు వరద ప్రమాదానికి గురయ్యాయి.

                                                     గతం నుండి ఎలాంటి పాఠాలూ నేర్చుకోనట్లే ఉంది..
1986లో రికార్డయిన వరద వివరాలు దాఖలయ్యే ఉన్నాయి. ఇప్పటికి మూడు దశాబ్దాలు గడిచినా నిర్వహణలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. గతం నుండి ఎలాంటి పాఠాలూ నేర్చుకోనట్టే ఉంది. ఎప్పుడు వరదొచ్చినా ముప్పు తప్పడం లేదు. ముందు జాగ్రత చర్యలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. ధవళేశ్వరం వద్ద కరకట్ట నిర్మాణం కూడా సగంలోనే ఆగిపోయింది. ప్రాజక్టుల పూడిక తీయకపోవడం ఇప్పుడో పెద్ద సమస్యగా మారింది. దీంతో గణాంకాలకు, వాస్తవ నీటి నిల్వలకు పొంతన లేకుండాపోయింది. ప్రాజెక్టులో లిఫ్ట్‌లకే కానీ స్టోరేజ్‌లకు ప్రాధాన్యతనివ్వకపోవడం సమస్యగా మారింది.

 </p>

 

 

 </p>