Sep 13,2022 07:52
  • 'వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్‌' ప్రచారం మాత్రమే..
  • నాలుగు శాతమే వృద్ధి..
  • దీంతో ఉపాధి కల్పన ఎలా ? : కేంద్ర మాజీ ముఖ్య గణాంక

న్యూఢిల్లీ : భారత ఆర్థిక వ్యవస్థ పూర్తిగా అంధకారంలోకి కూరుకుపోయిందని, కేవలం నాలుగు శాతం వృద్ధి రేటుతో ఉపాధి కల్పన ఎలా సాధ్యమవుతుందని కేంద్ర మాజీ ముఖ్య గణాంక అధికారి ప్రణబ్‌ సేన్‌ ప్రశ్నించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బిఐ ప్రకటించిన వృద్ధి లక్ష్యం 7.2శాతం, వాస్తవ గణాంకాల ప్రకారం వృద్ధి 4శాతం వద్దనే ఆగిపోయిందని ఆయన అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ తీరు అత్యంత ప్రమాదకరంగా ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు పాలకులు భారత్‌ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. అదే నిజమైతే దేశంలో ఈస్థాయిలో నిరుద్యోగం, ఉపాధి సమస్య ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. తాజాగా ఓ న్యూస్‌వెబ్‌ పోర్టల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఏమన్నారంటే...
    ''దేశ ఆర్థిక వ్యవస్థ ఎందుకు ఈ విధంగా ఉందన్నది కనుగొనవచ్చు. సమస్య ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నం కేంద్రం చేసిందా? లేదా? అన్నది నా వద్ద సమాచారం లేదు. అన్నింటికీ మౌనం వహించటం సర్వసాధారణమై పోయింది. కేవలం నాలుగు శాతం వృద్ధి రేటుతో మనదేశ జనాభాకు తగ్గట్టు ఉపాధి కల్పన ఎలా చేస్తారో నాకు అర్థం కావటం లేదు. ప్రజల్ని మభ్యపెట్టడానికి పాలకులు కొత్త ప్రచారం మొదలుపెట్టారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థగా ప్రచారం చేస్తున్నారు. ప్రజల కొనుగోలు శక్తి పెంచేలా ఉపాధి కల్పన లేదు. ప్రభుత్వ పెట్టుబడి వ్యయం లేదు'' అని అన్నారు.
 

అదొక్కటే మనల్ని కాపాడుతుంది..
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిణామాలు మన దేశానికి పెద్దగా ఉపయోగపడతాయని అనుకోను. దేశీయంగా రుణాలు అందుబాటులోకి తీసుకురావటం, రుణ సహకారం పెంచటం, చిన్నసూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల్ని ఆదుకోవటం ఒక్కటే మన ఆర్థిక వ్యవస్థను రక్షిస్తుంది. గత రెండేళ్లుగా చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమ కుంచించుకు పోతూ వస్తోంది. వీటిని ఎలా కాపాడుకోవాలి? అన్నదానిపై కేంద్రం ఆలోచన చేయటం లేదు. కొత్తవి ఏర్పడేట్టు సహకారమూ లేదు. ఇది చాలా ముఖ్యమైన సమస్య. ఇంకొక ముఖ్యమైన సమస్య.. అనధికారికంగా మార్కెట్లో లభించే రుణాలు ఆగిపోయాయి. ఎవరికీ ఎలాంటి రుణాలూ లభించటం లేదు. దీనికోసం కేంద్రం చేయాల్సింది ఎంతో ఉంది. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు దెబ్బతినడానికి కారణం తయారీరంగంలో పెద్దగా వృద్ధి లేకపోవటమే. సగటు ఏడాది వృద్ధి 4.8శాతానికి పరిమితమైంది. ఇందు వల్లే దేశంలో నిరుద్యోగం తీవ్రస్థాయికి చేరుకుంది. అసంఘటిత రంగం కార్యకలాపాలు ఆగిపోవటం ప్రధాన కారణం.