- ఉద్యోగుల కేటాయింపునకు 'ఆప్షన్' ఇవ్వాలి
- ఎపి జెఎసి అమరావతి సూచన
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగులకు రక్షణగా ఉన్న 'ప్రెసిడెన్షియల్ ఉత్తర్వుల్లో మార్పులు, చేర్పులకు సంబంధించి సలహాలు, సూచనలు చేయాలని ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలను కోరిన సంగతి పాఠకులకు విధితమే. ఈ నేపథ్యంలో ఎపి జెఎసి అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధానకార్యదర్శి పలిశెట్టి దామోదరరావు నేతృత్వంలోని బృందం బుధవారం కొన్ని సూచనలను సాధారణ పరిపాలన శాఖ (జిఎడి) అదనపు కార్యదర్శి ఎన్ శ్రీనివాసులుకు లిఖిత పూర్వకంగా అందజేశారు. ప్రధానంగా రాజధాని ప్రాంతంలో ఉన్న రాష్ట్ర స్థాయి కార్యాలయాలకు ప్రెసిడెన్సియల్ ఉత్తర్వులు వర్తించవని, 'రాజధాని ప్రాంతం' అనే నిర్వచనాన్ని తొలగించాలని సూచించారు.
జోనల్ స్థాయిలో ఫస్ట్ లెవల్ గెజిట్ వరకు కంటే చిన్నచిన్న కేడర్ వాళ్లు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు జోనల్ స్థాయిలో సెకెండ్ లెవెల్ గెజిట్ వరకు, అదే విధంగా మల్టీజోన్ స్థాయిలో సెకెండ్ లెవెల్ గెజిటెడ్ కన్నా పైస్థాయి కేడర్ వాళ్లను ఉంచాలని సూచించారు. కొత్త, పాత జిల్లాల మధ్య ఉద్యోగులను శాశ్వతంగా కేటాయించే సమయంలో ముందుగా ఉద్యోగుల నుంచి 'ఆప్షన్' తీసుకోవాలని కోరినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి కార్యాలయాల్లో (సచివాలయం, శాఖాధిపతులు, పోలీస్ కమిషనరేట్, రాష్ట్ర కార్యాలయాలు) పనిచేసే ఉద్యోగులు శిక్షణ కోసం వస్తే ఇబ్బంది లేదని, జిల్లా స్థాయి పోస్టులకు శాశ్వత ప్రాతిపదికన వస్తే, జిల్లా స్థాయిలో ఉన్న ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారని ఎపి జెఎసి అమరావతి పేర్కొంది. జిల్లా స్థాయి ఉద్యోగులకు రాష్ట్ర స్థాయి సచివాలయంలో పనిచేసే అవకాశం లేనప్పుడు వారు శాశ్వతంగా వచ్చేందుకు ఒప్పుకోవడం లేదని తెలిపింది. 1 నుంచి 7వ తరగతికి బదులు 4వ తరగతి నుంచి పదో తరగతి వరకు ఉంటే స్థానికత నిర్ధారణ చేయాలని పేర్కొంది.










